Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన భావన మారాలి
అమ్మాయిలంటే ఈ ఇరువై ఒకటో శతాబ్దంలో కూడా ఒక తేలిక భావన. తేలిక భావనే కాదు, అబలనీ, అన్ని పనులు చేయలేదని చులకన చేయటమూ వివక్షాపూరిత ప్రవర్తనలు ఇంకా కొనసాగటం బాధాకర విషయం. హింసా దౌర్జన్యాలే కాదు హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లనగానే కడుపులో చంపడాలు... ఇంకా ఎన్నో ఎన్నో రకాల విధ్వంసకాండ జరుగుతూనే వుంది. ఈ విషయాలన్నీ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూనే వుంటాము.
కానీ అమ్మాయిలు అన్నీ సాధించగలరని నిరూపించడానికి ఒలంపిక్ వేదిక సాక్ష్యంగా నిలిచింది. ప్రపంచంలోనే నూటా నలుభై కోట్ల జనాభా గల భారతదేశపు పేరును మొట్టమొదట నిలబెట్టింది. ఒక సాధారణ అమ్మాయే కావటం మనం గమనించాలి. గెలిచారనే చెప్పటం కాదు, ఓడిన హాకీ అమ్మాయిలు ఎంత ధీరులుగా పోరాడారు! మణిపురి అమ్మాయి మీరాబాయి చాను అంతంత బరువును ఎలా లేపగలిగింది. లవ్లీనా బాక్సింగ్ శక్తిని గురించి ఎంతని చెప్పుకోవాలి! ఆడపిల్లలంటే తక్కువ భావన, చులకన వున్న ఈ సమాజంలోంచే దృఢమైన పట్టుదలతో నిరంతర శ్రమతో మానసిక స్థయిర్యంతో లక్ష్యాలను వారు చేరుకోవటం సామాన్య విషయం కాదు.
బాక్సర్‌గా కాంస్యం సాధించిన లవ్లీనా వెల్లడించిన విషయాలు, మన సమాజం ఏ స్థాయిలో వుందో తెలియజేస్తుంది. తన తల్లికి తనతో పాటు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అలా ఆడపిల్లలను కన్నందుకు ఆమె తల్లిదండ్రులను 'ఏ పాపం చేసారో కొడుకులు కలుగలేదు' అని అవమాన పరిచారని, తల్లిపడిన వేదనను తలచుకోవటం మనమంతా తలదించుకోవాల్సిన విషయాలు. లవ్లీనా బాక్సింగ్ చేయడం ఆరంభించినపుడూ లింగ వివక్షతతో కూడిన వ్యాఖ్యలూ తనను ఎంతో బాధ పెట్టాయని, కసితో వాటన్నింటికీ సమాధానం చెప్పానని ఆమె చెప్పటం మన సామాజిక మానసిక స్థితులను ఎరుక పరుస్తాయి. స్త్రీలు ఇప్పుడే కాదు, ప్రతి సందర్భంలోనూ ప్రతి కాలంలోనూ తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటూ వున్నారు. సంప్రదాయం, ధర్మం, నీతి అనే భావనలను ప్రచారం చేసి మహిళలను అణచి వేస్తూనే వున్నారు. పుత్రుడు పుట్టకపోతే పున్నామ నరకానికి పోతారని, వంశోద్ధారకులు మగ పిల్లలేనని తప్పుడు అభిప్రాయాలను తరాలుగా బోధిస్తూనే వున్నారు.
అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, కుటుంబానికే కాదు మొత్తం దేశానికి పేరు తెచ్చి సబలలని బరువులెత్తి మరీ నిరూపించారు. అంతేకాదు మానవీయమైన ప్రతిస్పందననూ కనబరిచారు. మణిపురి మీరాబాయిచాను తను పేదరికంలో పెరుగుతూ కనీసం కోచింగ్ సెంటర్‌కు వెళ్ళేందుకు కావలసిన సదుపాయం లేక ట్రక్కు డ్రయివర్లను బతిమాలి, బామాలి ఎక్కి వెళ్ళేదని తెలిపింది. అందుకు ఆ డ్రైవర్లకు కృతజ్ఞతగా ఇప్పుడు వాళ్ళందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి, బట్టలు పెట్టి, చెమ్మగిలిన నయనాలతో ధన్యవాదాలు తెలపటం చూస్తుంటే, అమ్మాయిలు కాబట్టే అంత దయార్థ్ర హృదయం కలిగున్నారనే అనిపిస్తుంది.
నేటి క్రీడాకారిణులను చూసి అమ్మాయిలు అందరూ మనో ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అత్తారింటి ఆరళ్ళకు, భర్త వేధింపులకు, హింసకు భయపడి ప్రాణాలను బలి ఇవ్వటం కాదు, వీరనారులుగా పోరాడాలి. లింగ భేదము, రంగు భేదము, కుల భేదములు ఏవీ బలహీనతలను తెచ్చి పెట్టవని, మానసిక బలం ఎంతో ముఖ్యమైనదని అవగాహన చేసుకోవాలి. ఇప్పటికీ అమ్మాయిలు అన్నీ రంగాలలో ముందంజ వేస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో, పేద, మధ్యతరగతి వర్గాల్లో ఈ భేదాలు, వివక్షతలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తల్లిదండ్రుల మెదళ్ళలో గూడుకట్టుకున్న భావాలు కూడా తొలగించుకోవాలి. చాలా వరకు, చదువుకున్న వాళ్ళలో కూడా ఆడపిల్లలనగానే కొన్ని రకాల చదువులు, పనులు మాత్రమే వాళ్ళు చేయాలని షరతులు పెడుతుంటారు. అది సరైనది కాదు. ఏ పనియైనా, ఏ రకమైన చదువైనా, ఆటయినా, పాటయినా వారి ఇష్టాల ఆధారంగా ప్రోత్సాహాన్నివ్వాలి. అమ్మాయిలకు చిన్నప్పటి నుండి ఒక ప్రత్యేక భావాన్ని, నడకను, మాటను, నిర్ధేశిస్తూ, వారిని బలహీన మనుషులుగా పెంచటం మంచిది కాదు. దృఢమైన చిత్తాన్ని అందివవ్వగలిగినపుడే ఈ ప్రపంచంలో అమ్మాయిలు ముందుకు పోగలరనే విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రహించాల్సి వుంది. ఆడపిల్లల పట్ల మన భావనలు మారాలి. అప్పుడే వాళ్ళు విజేయులుగా నిలుస్తారు.