Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో తరగతి గది ఒక మధుర జ్ఞాపకం. తరగతి గది కేవలం పాఠాల ఆవరణే కాదు, చిన్న సమాజమంతటి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చే నెలవు అది. గది భౌతికం. నాలుగు గోడలు, కిటికీలు, తలుపులు అన్నీ ఎప్పటిలానే వుంటాయి. ఎన్ని తరాలు కదిలిపోతాయి ఆ ప్రదేశం నుండి. ఎన్ని తలపులు ఎదిగిపోతాయి ఆ సమ్మర్థం నుండి. ఒకసారి మనం పుస్తకాలతో, స్నేహితులతో, పాఠాలు వింటూ, అప్పుడప్పుడూ వింటున్నట్లు నటిస్తూ, తలలు వంచుకుని పక్కవాడితో ముచ్చట్లాడుకున్న జ్ఞాపకాల్లోకి వెళ్ళిరండి. ఎంత ఆనందం ఎద నిండుతుంది! ఎప్పుడయినా వీలుంటే చదివిన పాఠశాలలోని, తరగతి గదిని సృర్శించి రండి. మన బాల్య విద్యార్థి దశను ఎక్స్రే తీసుకుని రావచ్చు.
బడిలో లేదా తరగతి గదిలో ఎవరిది ప్రధాన పాత్ర అనే ప్రశ్న వేసుకుని ఒకసారి ఆలోచిస్తే ఉపాధ్యాయునిదే అని అనిపిస్తూ వుంటుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ మారుతుంది. అసలు కేంద్రకం విద్యార్థులు కదా! విద్యార్థులే లేని ఉపాధ్యాయుని పాత్ర ఏముంటుంది? అయితే ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థులు ఏమైనా నేర్చుకోగలుగుతారా అంటే... ఎస్... నేర్చుకుంటారు. పాఠశాలకు వచ్చినప్పటి నుండే నేర్చుకోవడం ఆరంభమవుతుంది. పరిశీలన, గుర్తింపు, అవగాహన, సంభాషణ, చర్చ, రాత, ఆలోచన, ఆట, పాట, స్నేహం, గౌరవం, పలకరించడం, కాలాన్ని అనుసరించడం, కయ్యాలు, నెయ్యాలు, సత్యాలు, అబద్దాలు, స్పర్థా, పొగడ్తా, ఆనందం, సంతోషం, అల్లరి, విమర్శ, వెక్కిరింత, బుజ్జగింత, సముదాయింపు, గిల్లికజ్జాలు, కలలు, ఆశలు, ఊసులు... ఇలా ఎన్నో ఎన్నో బడిలో గదిలో వుంటాయని కూడా తెలియని సామాజిక అనుభవాలు. అన్ని తరగతి గది ఆవరణలోంచి అనుభవిస్తాం. అందుకే ఉపాధ్యాయుడు ముఖ్యమే అయినా నాకెందుకో తరగతి ఆవరణమే ప్రధాన పాత్ర పోషిస్తుందని అనిపిస్తుంది.
ప్రధానమేదయినా, ఎవరి పాత్రలు వారివే. ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుడి పాత్ర కాలానుగుణంగా అనేక మార్పులకు లోనవుతూంది. అయినప్పటికీ విద్యాభ్యసన ప్రక్రియలో విద్యార్థి మనోఫలకంపై తీవ్రమైన ముద్రవేసే వారు ఉపాధ్యాయులే. కొందరైతే భవిష్యత్తుకు బాటలు వేసేవారుగా జీవితా గమనంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే అంటారు, మంచి గురువులను పొందగలగటం, వారి సాంగత్యంలో విద్య గరపటం అదృష్టంగా భావించాలి. విద్యార్థులకు కూడా శ్రద్ధాసక్తులు వున్నపుడే ప్రేరణ సాగుతుంది.
ఉపాధ్యాయుడంటే కేవలం పాఠాలు మాత్రమే చెప్పరు. అతనికెదురైన గుణపాఠాలనూ అప్పుడప్పుడు చెబుతారు. నిజంగా సిలబస్యేతర చర్చలోంచే నిజమైన జ్ఞానం సమకూరుతుందనిపిస్తుంది. నాకు తెలిసి ఉపాధ్యాయుడు ఒకే పాఠం బోధిస్తున్నా, తరగతి గది అదే అయినా ప్రతి రోజూ కొత్త అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందుతూనే వుంటాడు. ఉపాధ్యాయుడుగా పని చేసిన వారికి, తాను చదివినప్పుడు, తాను చెబుతున్నప్పుడు రెండు అనుభవాలూ తరగతి గది కల్పిస్తుంది. ఇది వారికే దక్కుతున్న అవకాశం. అరుదైన అనుభవం.
తరగతి గదిలో ఉపాధ్యాయునికి ధీటుగా దర్శనమిచ్చేది బ్లాక్ బోర్డు కూడా. నిజంగా ఇది ఉపాధ్యాయుడికి సహాయకురాలు. అంతేకాదు ఉపాధ్యాయుడి పొరపాట్లను దిద్దే ఉపాధ్యాయురాలు. ఎప్పుడయినా మన మనసులో అనుకుంటున్నవి, చెప్పాలని అనిపించేవి బ్లాక్ బోర్డుపై రాయాలనిపిస్తుంది. కానీ అది తరగతి గదిలోనే వుంటుంది కదా! ఇంట్లో కూడా ఒక బోర్డు ఉండాలి. మనల్ని మనం గీసుకోవాలి. పాఠం నేర్చుకోవాలి. అందుకే తరగతి గదులు కేవలం ప్రదేశాలు కాదు, గుండె లయలు. తరాల ప్రవాహ వేదికలు.