Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రైట్ టు సిట్' ఉద్యమం ...
పది, పన్నెండు గంటలు
నిరంతరంగా నిలుచోవటం,
పని చేయటం అంటే కనీస
మానవీయత లేని
పరిస్థితులను వ్యతిరేకంగా
వచ్చిన ఈ ఉద్యమ ఫలితంగా
దేశంలోనే మొట్టమొదటి
సారిగా కేరళ ప్రభుత్వం,
వారి బాధను గ్రహించి
కమర్షియల్
ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను
సవరించి ఉద్యోగులు,
సేల్స్ గర్ల్స్ కూచునే హక్కును
కలిపించింది. కేరళ రాష్ట్రాన్ని
ఆదర్శంగా తీసుకున్న
తమిళనాడు రాష్ట్రం కూడా
ఈ విధానాన్ని అమలులోకి
తీసుకువచ్చింది.
ఈ ప్రభుత్వాలు నిజంగా
ఒక ముందడుగు వేశాయి.
మరి మిగతా రాష్ట్రాల సంగతి
ఏమిటి? మన
తెలంగాణలోనూ ఆలోచించి
నిర్ణయం తీసుకోవాలి.
సమాజంలో ఎవరికి మనం గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని ప్రశ్నవేసుకుంటే, శ్రమ చేస్తూ బ్రతుకుతున్న వారికి అని చెప్పాలి. ఏ పనీ చేయకుండా హాయిగా బ్రతికేస్తున్న వాళ్ళంతా సోమరులకిందే లెక్క. సోమరులే కాదు. ఇతరుల శ్రమ ఫలాన్ని తింటూ కూర్చున్న వారని అర్థం. కానీ నేటి సమాజంలో శారీరకమైన శ్రమేదీ చేయని వారికే విలువ ఎక్కువిస్తున్నాం. మానసికంగా చేసేది కూడా శ్రమనే. అనాదిగా మనకున్న అలవాటు ఏమిటంటే పని చేయనివాడు, పని చేయకుండా కేవలం పెత్తనం చేసే వారికే మనం మర్యాద, గౌరవం ఇస్తుంటాము. ఇదో తల్లకిందుల సంప్రదాయం. ఈ విలువలు, మర్యాదలు అన్నీ వ్యవస్థ గమనంలోంచి వచ్చినవే. అంటే వ్యవస్థ కూడా అలా తలక్రిందులుగా నడుస్తున్నదే. దీనిని సరిగా నిలబెట్టటం కోసమే అనేక మంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
సంస్కృతిలో భాగంగా వున్న భాష, సంప్రదాయాలు, మర్యాదలు, గౌరవాలు, విలువలు, నీతులు , రీతులు అన్నీ కూడా ఎవరో కావాలని నేర్పిస్తేనో, కొందరు బోధిస్తేనో అలవడేవి కావు. సమాజపు విధానపు ఆధారంగానే ఇవన్నీ వుంటాయి. మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీ శక్తిమంతురాలుగా భావించారు. భూస్వామిక పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీని అబల అని ముద్రవేశారు. ఏదేమయినా 'స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం' అని ఇప్పటికీ బోర్డులపై రాసి మరీ గుర్తు చేస్తున్నా గౌరవించడం ప్రక్కన పెట్టి దాడులకు, అత్యాచారాలకు హత్యలకు పూనుకుంటున్నారు. ఇదో విషాదం. స్త్రీల పట్ల వివక్ష, స్త్రీ అంటే బలహీనురాలని, ఎవరో ఒకరి సంరక్షణలో వుండాలని, ఏ నిర్ణయాధికారం ఉండరాదని భావించిన భూస్వామిక భావజాలం నుంచి ఇప్పుడు పెట్టుబడి దారీ సమాజపు సరుకుల అమ్మకపు కొనుగోలు దశలోకి వచ్చాక, స్త్రీని కూడా ఒక సరుకుగా చేసి ఉపయోగించుకొనే దశకూ వచ్చాము. మరింత హింసకు గురి చేసే దుర్మార్గపు సంస్కృతిలోకి లాగివేయబడ్డాము.
అంటే ఒక్క స్త్రీలనే కాదు మనుషులందరినీ సరుకులుగానే భావించే దశ దాపురించింది. శ్రామికులను యంత్రాలుగా, పని ముట్లుగా చూసే క్రమం కొనసాగుతోంది. అందులో భాగంగానే మనుషులు పని చేసే చోట, యజమానులు చాలా ఘోరమైన ఆంక్షలు, నిబంధనలు విధిస్తూ అధికమైన శ్రమను దోచుకోవాలని చూస్తున్నారు. పని గంటలనూ పెంచి, కనీస విరామ సమయాన్ని కూడా ఇవ్వకుండా పనిని పిండుకోవటం నేటి వ్యవస్థ లక్షణం, మన దేశంలో షాపింగ్ మాల్స్‌లలో పని చేస్తున్న కోట్లాది మందిలో 70 శాతం స్త్రీలే ఉంటారు. క్లాత్ స్టోర్స్, బిగ్ బజార్, డిమార్ట్‌లు, రిలయన్స్ మార్ట్లు, అన్నింటిలోనూ మహిళలే ఎక్కువ. ప్రతి రోజూ వాళ్ళు 9 నుంచి 12 గంటలు పని చేస్తూ వుంటారు. వాళ్ళకు కనీసం కూర్చోవడానికి ఏమీ వుండవు. కస్టమర్లు లేనప్పుడయినా కూర్చునే అవకాశం లేకుండా చేసారు యజమానులు.
అందుకే 'రైట్ టు సిట్' ఉద్యమం మొదలైంది. మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటారు. పది, పన్నెండు గంటలు నిరంతరంగా నిలుచోవటం, పని చేయటం అంటే కనీస మానవీయత లేని పరిస్థితులను వ్యతిరేకంగా వచ్చిన ఈ ఉద్యమ ఫలితంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా కేరళ ప్రభుత్వం, వారి బాధను గ్రహించి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను సవరించి ఉద్యోగుల, సేల్స్ గర్ల్స్ కూచునే హక్కును కలిపించింది. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్న తమిళనాడు రాష్ట్రం కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ ప్రభుత్వాలు నిజంగా ఒక ముందడుగు వేశాయి. మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటి? మన తెలంగాణలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క మాల్స్‌లోనే కాదు ప్రయివేటు పాఠశాలలోనూ ఉపాధ్యాయులు మొత్తం తరగతి గదుల్లో నిలబడే ఉండాలన్న నిబంధనలూ పెట్టి కుర్చీలను నిషేధించారు. ఇది చాలా దారుణమైన అమర్యాదకరమైన చర్య. ఇప్పటికయినా మర్యాదగా వ్యవహరించి నిత్యం శ్రమ చేస్తున్న వారిని కూర్చోమనడం మానవీయ సంప్రదాయం.