Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటారు అందరు. సంతోషం వెళ్లివిరిసినప్పుడే ఆరోగ్యమూ చేకూరుతుందనీ అంటారు. సంతోషంగా ఉండాలన్న కోరిక అందరిలోనూ వుంటుంది. 'అదిగో చూడండి ఆ కుటుంబంలో ఎప్పుడూ సంతోషం కనిపిస్తుంది'. అని చెప్పుకొంటాం. ముఖాన్ని చూడగానే సంతోషంగా వున్నాదీ లేనిదీ చెప్పేయొచ్చు. కొందరికి ఎన్ని ఇబ్బందులున్నా ముఖం మాత్రం సంతోషం ఉట్టి పడుతున్నట్టే వుంటుంది. మరికొందరిలో నయితే ఎంత సౌమ్యంగా వున్నా సంతోషం కనిపించనే కని ఉంచదు. సంతోషమంటే ఏమిటి! సంతసము, ముదము, మోదము, సౌఖ్యము, సుఖము, అభినందనము, అభిప్రీతి, అహ్లాదము, ఆనందము, ప్రమోదము, ప్రీతి, మెచ్చు, మెలవు, సుమనస్సు, హర్షము, ఇలా అనేక పర్యాయపదాలున్నాయి. సంతోషమంటే ఒక రకమైన మానసిక సంతప్తి,
సంతోషం అనే అంశం వైయక్తికమైనది కాదు. మానవ భావోద్వేగాలన్నీ సామూహిక జీవనంలోంచివచ్చినవే. మన సంతోషానికి, బాధకు, కష్టానికి మనకు పదుగురితో వున్న సంబంధమే కారకముగా నిలుస్తుంది. బాధలు, కష్టాలు ఎదురౌతుంటే సంతోషంగా వుండలేరు ఎవ్వరు. పెద్దలకన్నా చిన్నపిల్లలు ఎక్కువ సంతోషంతో ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకింకా జీవనయాతనలు, సవాళ్ళు ఎదురు కావు కనుక. వారికెదురయ్య వాటన్నిటినీ ఇంట్లోని పెద్దలు తలకెత్తుకుంటారు కదా! అందుకని. అందుకనే మహాకని అంటాడు... 'కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు, పాపం, పుణ్యం ప్రపంచమార్గం ఏమీ ఎరుగని పిట్టల్లారా పిల్లల్లారా! అని. కాబట్టి పిల్లలతో మనం ఎక్కువగా గడపగలిగితే సంతోషాన్ని పంచు పంచుకోగలుగుతాము. ఇంట్లో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, పిల్లల కోసం ఎంత కష్టం ఎదురైనా వాళ్ళు అందించే సంతోషం కోసం అన్ని భరిస్తూ వుంటుంది. ఆ సంతోషం చాలా స్వచ్ఛమైనది. ప్రకతంత అందమైనది కూడా. అందుకనే పది రోజుల పసికందు కూడా మనుషుల్ని చూసి ఓ సంతోషపు చిరునవ్వును విసురుతుంది. పిల్లలున్న ఇల్లు సంతోషాల హరివిల్లు అంటారు కవులు.
పండుగల వేళ ప్రతి ఇంటిలో సంతోషాలు నిండాలి నిండుతాయి. ఎందుకంటే కొత్తబట్టలుంటాయి. పిండి వంటలుంటాయి. బంధువులందరూ కలుస్తారు. ఇల్లంతో సందడి సందడిగా మారిపోయిన వేళ దూరాన వుండే కుటుంచీకులు కలుసుకున్నప్పుడు సంతోషంగా నేవుంటుంది. అయితే ఈ సందడి అంతటికీ మూలమయింది ముఖ్యమయినది ఆదాయం.. ఆదాయాలు, ఆర్థిక స్తోమత అనుకున్నంతగా లేదా సరిపోయినంతగా వున్నప్పుడే అన్నీ సమకూరుతాయి. పల్లెల్లో నయితే రైతులు కూలీలు,
వివధ వత్తుల్లో పనులు చేస్తున్న వర్గాలు సంతోషంగా వుండాలంటే వారి ఆదాయాలు బాగుండాలి. పంటలు పండాలి. గిట్టుబాటు ధరలు రావాలి. కనీస కూలీ దొరకాలి. ఉపాధి అందరికీ దొరకాలి. అప్పుడే ఆనందం, సంతోషం. బయట మార్కెట్ మాయజాలం మనల్ని సంతోషంలో ఆనందంలో ముంచెత్తేందుకు అని చెప్పి తన సరుకుల్ని కొనే విధంగా ప్రేరేపిస్తూ వుంది. ఆదాయాలు కొనేంత లేకపోయినా అక్కడే అప్పులు ఇప్పిస్తాయి. ఆశలు రేకిస్తాయి. చాలా మంది మధ్యతరగతి ప్రజలు, మనమూ వాళ్ళలా ఉండకపోతే ఎలా? కనీసంగా కొనుక్కోవాలికదా! ఎట్లయినా, ఏదయినా చేసి షోకేసుల్లోని వస్తువులు కొనగలిగితేనే సంతోషమన్నట్లు మన మనస్సులను మార్చేస్తుంటారు. అప్పుల పాలయి జీవితాన్ని ముందుగానే తాకట్టు పెట్టేస్తుంటారు. సాధారణ ప్రజలను ఆటాడించే సరుకులలోకంలో సంతోషమంటే సరుకును కోనడమే అవుతుంది.
కనీస అవసరాలు తీరాక మన స్థాయిని బట్టి వ్యవహరించాలే తప్ప అప్పులతో చేసే సరుకు కొనుగోళ్ళలో సంతోషాలు పండవని గుర్తుంచుకోవాలి. మన సంపాదన, ప్రతిఫలాలు ఎందుకు పెరగడం లేదో ఆలోచించాలి. మన కష్టాన్ని ఎవరు కొట్టేస్తున్నారో తెలుసుకుని సాధించేందుకు పూనుకోవాలి. ఆ కొట్టేసే వాళ్ళే వాస్తవంగా మన సంతోషాలనూ కొట్టేస్తున్నారని అవగాహన చేసుకోవాలి. సంతోషం ఎవరో ఇచ్చేది కాదు. మనం సాధించుకోవాల్సింది కూడా. అయితే సమాజంలో అశేష ప్రజల సంతోషాలలోనే మన సంతోషమూ ఆధారపడి వుంటుంది. ఏది ఏమైనా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుందాము.