Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతమొందించగల శత్రువు కంటే పెద్ద శత్రువు మనలోవుండే భయం. భయం కలిగి వుండటమే అత్యంత భయంకరమైన విషయం. భయభక్తులు కలిగివుండాలని, అట్లా వున్న వాళ్ళను మంచి మనుషులుగా మర్యాద మనుషు లుగా యెంచి చూడటం సంప్రదాయంగా చెప్పుకునే విషయాలు, భక్తి వుంటే వున్నది. భయమెందుకు వుండాలో అర్థం కాదు. భయం అంటే అణకువగా ఎదురు చెప్పకుండా వుండటం. ప్రశ్నించటం కూడా భయంలేక పోవటమనే అంటారు. భయమనేది మనిషి స్వతంత్ర ఆలోచనను, వ్యక్తీకరణను అడ్డు కుంటుంది. బానిస సమాజపు లక్షణంగా దానిని చెప్పుకోవచ్చు. ఆలోచనల వికాసం కాకుండా ఇతరులను అనుసరించడమే వుంటుంది. మనసులో భయం చేరితే మనం బలహానులంగా మారిపోతాం.
చెప్పడానికి భయపడి, చూడటానికి భయపడి, రాయడానికి భయపడి, ఆలోచించటానికీ, ఆచరించడానికి కూడా భయపడటం జరిగితే ఈ సమాజం ఒక్క అడుగు కూడా ముందుకు నడిచేది కాదు. భయం మానసికమైన దౌర్భల్యం. కష్టాలు, సవాల్లు, ఆపదలు, కఠిన సమయాలు ఎదురైనప్పుడు భయం ఆవహిస్తే వాటి నుంచి బయటపడకపోగా మరింత బాధల్ని మిగులుస్తాయి. ఆ సమయాల్లో అప్పుడు మనకు కావల్సింది. ఎలా వాటి వాటి నుంచి బయట పడాలోననే ఆలోచన, నైపుణ్యాలు తప్ప, భయం మనల్ని ఒడ్డున చేర్చదు. భయంవల్ల స్వతహాగా వున్న విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతాము.
మన భయాలు కొందరికి అవకాశాలుగా మారతాయి. వాటిని సామ్ము చేసుకుని మోసాలకు పాల్పడతారు. సమాజంలో సామాన్య ప్రజలలోవున్న అనేక భయాలను ఆసరా చేసుకొని మోసాలు, దోపిడీలు జరుగుతున్నా యి. ఈ మధ్యకాలంలో మనుషుల్లో అనేక భయాలు చుట్టు ముడుతున్నాయి. దోపిడి వున్నచోట భయమూవుంటుంది. దోపిడి పెరిగిన చోట మరింత భయం పెరుగుతుంది. అందుకే రక్షణ వ్యవస్థలు పెరిగాయి. ఆధునిక వ్యవస్థ ఒక భయా వరణాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఇది అనేక పీడనలకు కేంద్రం, ఈ సమాజంలో మనుషులు తాము ఒంటరివాళ్లుగా భావించుకుంటారు. భయవడ్డ పసిబిడ్డ తల్లిని గబుక్కున హత్తుకుంటుంది. అంటే మరో వ్యక్తితో వుండటం ధైర్యాన్ని ఇస్తుంది. సామూహిక జీవనంలో ఎక్కువగా భయాలు వుండవు.
సమష్టి ప్రయాణంలో, పనిలో ధైర్యం నిండుగా వుంటుంది. కానీ నేటి సామాజిక జీవనం వైయక్తిమై పోయింది. ధైర్యాన్నిచ్చే చెలిమికి దూరమయి తనకు తానే ఒంటరియై భయాల పద్మవ్యూహంలో చిక్కుకుని పోతున్నాడు. ఒక భరోసా, నేనున్నాననే హామీలేమీలేని సమాజ గమనం భయాలకు పురుడు పోస్తుంది..
ఇంకా మన భారతీయ సమాజంలో తరతరాలుగా కర్మ సిద్ధాంతం. వేలూనుకొనివుంది . మనం అనుభవిస్తున్న ఈ వేదనకు మనమే కారణమనే భావన జీర్ణించుకోపోయి వుంది. ఈ కర్మఫల బోధనను ఆధిపత్య వర్గాలు. తమకు అనుకూలంగా మలుచుకుని ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రశ్నలు ఎక్కుపెట్టాల్సినవారు భయాలతో బ్రతుకులీడుస్తున్నారు. 'భయం తొలిగి మనిషి గమనం సాగిననాడే నిజంగా అతను బ్రతికివున్నట్టు' అని చెబుతున్న మాట అక్షర సత్యాలు. ధైర్యం కోల్పోయిన నాడు మనిషి ఒక జీవశ్చవం. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిశోధనలో ఎన్నో ఆవిష్కరణలు జరిగి భయాలను పోగొట్టే ప్రయత్నం పెరుగుతున్న సందర్భంలో భయాలు పెరగటం ఒక విషాదం.
నేడు కరోనా పేరుతో అనేక భయాలను ప్రచారంలో పెడుతున్నారు. జాగ్రత్తలకు, భయాలకు వ్యత్యాసముంది. తీసుకోవాల్సింది జాగ్రత్తలూ నివారణా చర్యలు తప్ప భయాలు పెంచడం కాదు. ఇప్పుడు మరీ 'ఒమిక్రాన్ వేరియంట్ ' విజృంభణతో లేని పోని భయాలను ప్రచారంలోకి తెస్తున్నారు. దీనివెనకాల ఫార్మామాఫీయాలు కూడా వుంటాయని కొందరు అంటున్నారు. నిజాలేవో తెలియని సమాజంలో అబద్ధాన్ని కనుగొనటమూ ఎంతో కష్టమైన విషయం. అందుకని ప్రజలు,, ఏ రకమైన సవాళ్లు ఎదురైనా భయాలను విడనాడి ధైర్యంగా ముందుకు నడవాలి. అలా అన్నా మంటే ఇష్టారీతిన వ్యవహరించడం కాదు. సమస్త జాగ్రత్తలతో శాస్త్రీయ విధానాలను పాటిస్తూ నిర్భయంగా జీవనాన్ని గడపాలి.