Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవున్ని కొలుస్తూనో, స్మరిస్తూనో ఉండటాన్ని జపం అంటారు. మరి ఈ కొంగజపమేమిటి అనే సందేహం మనకేమీకలగదు. ఎందుకంటే కొంగజపం కథ మనందరికీ తెలుసు. అయినా ఆ కథను స్మరించుకొనేలా మన నేతల చేతలు కనపడుతుంటాయి. పూర్వము ఓ వద్థ కొంగ, చెరువు వొడ్డున రాతి మీద ఒంటి కాలితో మౌనంగా ధ్యానం చేస్తూ వుంటుంది.
దాని ముక్కుకు ఎక్కడ బలౌతామోనని భయపడే చేప పిల్లలు ఆశ్చర్యపోయి చూశాయి. కొంగపాపం చేపలవైపు కూడా చుండకుండా ఎంతో భక్తితో జపం చేస్తూ వుండటం గమనించిన చేపలు. ఓ ఖగోత్తమా! ఏమిటి అలా మౌనంగా వున్నారు! మావైపే చూడటం లేదూ అని అడుగుతాయి. అప్పుడు ఆ వద్థ కొంగ నాయనలారా! మిమ్ములను చంపి తినీతినీ నేననేకపాపములు చేసినాను. ఈ పాపాన్ని కడిగేసుకోవటానికి ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను. ఈ ముసలి తనములోనైనా మోక్షము ప్రసాదించాలని వేడుకుంటున్నాను. జీవహింస చేయరాదని నిర్ణయము తీసుకున్నాను. ఇప్పటి వరకు మిమ్ముల బాధపెట్టినందుకు క్షమించండి. నేనిక ఆహారమే మానివేసినాను. అని ఆ మీనములకు సౌమ్యముగా విన్నవించింది. ఆ మాటలు నిన్న చేపలు పాపం. కొంగ మనసు మారిందని, అహింసవ్రతాన్ని స్వీకరించిందని నమ్మి తపస్సు చేస్తున్న కొంగ చుట్టూ నిర్భయంగా తిరుగుతూ వున్నాయి. తన చుట్టూనే తిరుగుతున్న చేపలను చూసీ చూసీ ఎవరికంట పడకుండా కొంగ తన ముక్కున కరచుకుని మింగుచూ శ్రమలేకుండా ఆహారాన్ని సంపాదించుచూ చెరువులోని చేపలన్నింటినీ స్వాహా చేసెను.
ఇది అసలు కథ అచ్చం అలానే జరుగుతున్నది నేటి మన దేశ రాజకీ(యి చిత్రాన్ని చూస్తే, మొన్న ప్రత్యేకంగా కాశీ విశ్వనాధున్ని దర్శించుకునేందుకు మన ప్రధాని వెళ్లారు. గంగలో మునిగారు. పవిత్రా గంగాజలాన్ని కలశంలో తీసుకునివచ్చి, కాశీవిశ్వేశ్వరుని ఆలయానికి వెళ్ళారు. వేలకోట్లతో ఆలయ విస్తరణ పర్యవేక్షించారు. ఒక్కరోజు పర్యటనలో ఐదు రకాల వస్త్రాలంకరణలతో ప్రధాని మనకు దర్శన మిచ్చారు. ఆ సందర్భంలోనే కెమెరావైపుకు తిరిగి మంచి పోజులు కూడా పెట్టారు. అవరభక్తుని అవతారమెత్తారు చూడ ముచ్చటగా వున్న దృశ్యాలన్నీ మనలను ఆనందపరుస్తవి.
ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడయినా ఎక్కడికయినా తిరిగే హక్కువున్నది. తన భక్తినీ కొనసాగించవచ్చు కానీ త్వరలోనే ఉత్తరప్రదేశలో ఎన్నికలు జరుగబోతున్నవి. ఆ ఎన్నికలు కేంద్రానికి ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీకి కీలకంగా మారింది. ఎందుకంటే మొన్నటి చారిత్రాత్మక రైతు ఉద్యమ ప్రభావం ఉత్తరప్రదేశ్నూ తాకటం వల్ల నాయకమన్యులకు సెగపెరిగింది కూడా. ఏ యెండకు ఆ గొడుగు. పట్టటం, ఎక్కడి పాట అక్కడ పాడటం, రంగులు మార్చే ఊసరవెల్లులు, అనే సామెతలన్నీ కేవలం సామెతలు కావు. మనుషులలో, అదీ రాజకీయాలలోనైతే అచ్చంగా సరిపోయే సామెతలవి.
పోయినేడు కరోనా మహమ్మారి దాడిలో ఉత్తరప్రదేశ్లో ఆక్సీజన్ అందక, ఆసుపత్రులలో బెడ్లుదొరకక, వైద్యం కరువయి అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆఖరకు స్మశానంలోనూ స్థలాలు లేని దుస్థితి దాపురించింది. గంగా నదిలో శవాలు ప్రవహించాయి. దుఃఖం ఏరులైపారింది. అప్పుడు కనీసం కన్నీళ్లు తుడవటానికి కూడా ఏ నాయకుడూ రాలేదు. ఓదార్పును అందివ్వలేదు. కనీస భరోసాను కలిగించలేదు. రాజకీయం చేయటం నా వుద్దేశం కాదు కానీ కళ్ళముందు జరుగుతున్న తంతు కదా ఇది! ఒకవైపు మన ప్రాంతంలో రైతులు పండించిన పంటను కల్లాల్లో పెట్టుకుని, కన్నీళ్లతో కడతేరిపోతుంటే, మేము వడ్లు కొననే కొనమని కేంద్రం మొండికేసింది. వందల కోట్లు ఖర్చుపెట్టి గుళ్లుగోపురాలు కడుతూవున్నది. ప్రచారార్భాటానికీ వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఇదెక్కడి నాయకత్వనీతి రీతి!
అందుకే పురాణ కథలు ఊరికనే పుట్టలేదు. పరిస్థితులు, మునుషుల ప్రవర్తనలు, పాలకులతీరుతెన్నుల ప్రతిబింబంగానే వెలువడ్డాయని ఇలాంటివి చూసినప్పుడు అని పిస్తూ వుంటుంది. కొంగ జపమూ అంతే!