Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వెక్కడికి వెళ్ళినా నిను వెంబడిస్తూనే వుంటా అన్నట్టుగానే కరోనా వైరస్ రకరకాల అలంకరణలతో మనల్ని వెంటాడుతూనే వుంది. ఆరంభంలో గడగడలాడించిన మహమ్మారి లక్షలాది ప్రాణాలను బలితీసుకుంది. రెండేండ్లూ భయం గుప్పిట్లోనే గడిచిపోయాయి. తన వేశం మార్చుకుని డెల్టారూపంలోనూ విజృంభించింది. ఇప్పుడు ఒమిక్రాన్ పేరుతో విహారం మొదలెట్టింది. ఒమిక్రానే కాక కరోనా తిరిగి ముంచెత్తుతూ దాడికి పూనుకుంది.
ఇది మూడవ అల ఉధృతి అంటున్నారు నిపుణులు. అత్యంత వేగంగా విస్తరణ జరుగుతుందని చెప్పినట్టుగానే రోజుల్లోనే దాని వేగాన్ని చూపెట్టింది. పదులో, వందల్లోకి తగ్గిన కేసులు వేలు అంటుండగానే లక్షల్లోకి ఎగబాకింది. మన దేశంలో కంటే విపరీతంగా యూరప్‌ను వెంటాడుతోంది. అమెరికాలో రోజుకు ఏడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో, ఆస్ట్రేలియాలో లక్షల్లో పెరుగుతున్నాయి. మన దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా నమోదయ్యాయి. తెలంగాణలోనూ రోజురోజుకు పెరిగి వేలుగా మారుతున్నది. ఇవి కేవలం లెక్కల వివరాలు కాదు. ప్రాణాలతో చెలగాట మాడుతున్న పరిస్థితిలు.
విపత్తుల్తో రెండేండ్లు దాటిపోయిన కారణంగా మనమంతా నిర్లక్ష్యంగానే వుంటున్నాము. అందరూ మాస్కులు పెట్టుకోవడం, దూరాలు పాటించడం, సానిటైజర్ వాడటం తగ్గిపోయింది. ముఖ్యంగా యువకులు మాస్కులు వాడటమే లేదు. జనసమ్మర్థాలు, షాపింగులు, బార్లు, పబ్‌లు, పెండ్లిళ్ళు, ఫంక్షన్లు సమావేశాలు, సభలు జరిగిపోతూనే వున్నాయి. ప్రభుత్వాలు కూడా చూసీ చూడనట్లే వ్యవహరిస్తున్నాయి. ఎవరి ఆరోగ్యానికి వారే పూచి పడాలంటున్నాయి. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వాలు ఎప్పుడో వదలిలేశాయి. ఏదో నామమాత్రపు ప్రకటనలు చేస్తున్నారు. తప్ప చర్యలకు చర్యలకుకు పూనుకోవడం లేదు. రెండేళ్లుగా ప్రజలందరినీ అష్ట కష్టాలు పెడుతున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి ఇంకా మనం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోలేదు. దాని బారిన పడిన వారికి వైద్యం అందించేందుకు కావలసిన వైద్యశాలలు ఏమీ నిర్మించనూలేదు. వైద్య సిబ్బందినీ పెంచలేదు. వైద్యుల సమస్యలనూ పరిష్కరించలేదు. కానీ వారికి అవసరమైన భవనాలు, తీస్తూనే వున్నాయి. ఎన్నికలు, అధికారాలు, పదవుల పందేరాలు కొనసాగుతునే వున్నవి.
కొత్త సంవత్సరంలోనైనా కొంత స్వేచ్ఛగా గాలి పీల్చుకుందామనుకుంటే తిరిగి ముప్పు వాటిల్లుతోందన్న వార్త కలవర పెడుతున్నది. ఇప్పుడసలే పండుగల సందర్భం. సంక్రాంతి సందర్భాన సంతోషాలతో తమతమ సొంతూళ్ళకు వెళ్ళి సంబరంగా గడపాలనుకుంటున్న వాళ్ళకు ఇదొక పెద్ద సమస్యగా ఎదురు నిలబడుతోంది. అసలే చలికాలం. విస్తరణకు అనువైన కాలం. పిల్లల పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఎంతో జాగ్రత్త వహించడం అవసరం. అలసత్యం పనికిరాదు. అందుకనే చెప్పిన విషయాలను మళ్ళీమళ్ళీ చెప్పుకోవాల్సివస్తోంది. అత్యధిక జనాభా కలిగిన మన లాంటి దేశాలలో కరోనా విజృంభిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలే తట్టుకోలేక పోతున్నాయి. మన బ్రతుకుదెరువును చూసుకుంటూనే ఆరోగ్య రక్షణ కోసం శ్రద్ధ వహించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తూనే వుంది. కొత్తవేరియంట్ల ప్రభావం పెద్దగా ఉండదనే ప్రచారంలో వాస్తవాలెంతో మనకు తెలియదు. రెండు డోసుల వ్యాక్సిను తీసుకున్నవాళ్ళకూ కరోనా సోకుతూనే వుంది. బూస్టర్ డోసు రక్షణ నిస్తుందా? అదీ తేలలేదు. ప్రజల ఆరోగ్యం ఎలా మారనుందో అంత అగమ్యగోచరంగా తయారయింది. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే స్థితికి చేరింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండటమే మనం చేయగలిగింది.