Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆత్మశుద్ధిలేని ఆచరమదియేల/ భాండశుద్ధిలేని పాకమేల!/ చిత్తశుద్ధిలేని శివపూజలేలరా/ విశ్వదాభిరామ వినురవేమ!' అని ఎంతో విడమర్చి చెప్పాడు వేమన. ఈ సూక్తి ఆసాంతం మన చినజీయరు స్వామికి చెప్పినట్లే అనిపిస్తుంది. ఈ నెల రెండో తేది నుంచి ముచ్చింతల్లో రామానుజుడి సహస్రాబ్ధి సమారోహం పన్నెండు రోజుల పాటు నిర్వహించిన విధానం చూస్తే ఆపద్యమే గుర్తుకొచ్చింది. సమతామూర్తి రామానుజుడి 216 అడుగుల విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 'రండిరో, పదండిరో సమతామూర్తి జాతరకు' అంటూ పాటలూ హౌరెత్తాయి. ఏనాడో పదకొండో శతాబ్ధంలో సమతను బోధించాడని, కుల భేదాన్ని విడనాడి సమానతకై ఉద్యమించాడని ప్రచారం చేసిన నిర్వాహకులు ఈనాటి సమతకు తిలోదకాలిచ్చారు. సమానతను తుంగలో తొక్కారు.
ఆత్మశుద్ధిలేని ఆచరణ అంటే ఇదే విధంగా వుంటుంది. అసలు ఇలాంటి వారి నుంచి సమతను ఆశించడమే ఓ వెర్రితనం. సమతను అటుంచి అస్పృశ్యతను స్పష్టాతి స్పష్టంగా ఆచరించిన విధం, అసమసమాజ కొనసాగింపును సూచిస్తుంది. ప్రధాని, హౌంమంత్రి, ఉపరాష్ట్రపతి మొదలైన వారందరూ వచ్చిపోయాక మన భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్చే చివరికి రామానుజ విగ్రహ ఆవిష్కరణ గావించారు. ఆయన విగ్రహాన్ని తాకాడని, తెల్లవారి విగ్రహానికి మహా సంప్రోక్షణ చేయించారు. మన జీయరుగారు. అంటే రాష్ట్రపతి ఒక దళితుడు కావడం చేత, అపరిశుభ్రమైన విగ్రహాన్ని శుభ్రపరిచే పనికి ఆయన పూనుకున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. వీరు చెబుతున్న, చెప్పిన సమత ఏమైంది? రామానుజుడి బోధన ఏ కులాల క్రీనీడన కరిగి పోయింది? ఇంతటి వివక్షాపూరితమైన విధానాన్ని కొనసాగిస్తూ సమత గురించి మాట్లాడటం ఒక విడ్డూరమైన విషయం. మాటలకు చేతలకు వున్న అంతరాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. రామానుజుని అనుచరులమని చెప్పుకునే వారంతా కులాధిపత్య భావజాలంగల వారేనని తేటతెల్లమవుతోంది.
ఆది శంకరుని అద్వైత సిద్ధాంతం కానీ రామానుజుడి విశిష్టాద్వైతం మధ్వాచార్యుని ద్వైతం, ఏదైనా కుల వ్యవస్థను, కుల వ్యత్యాసాలను, భేదాలను తొలగించటానికి పూనుకుని పనిచేయలేదు. వీళ్ళకంటే ముందు క్రీస్తు పూర్వపు బౌద్ధం బోధించిన బుద్ధుడు సమతను బోధించి ఆచరించాడు. స్త్రీ పురుష అసమానతలను, కుల అసమానతలు కూడదని బోధించాడు. ఇప్పుడు నిజంగా ప్రచారం చేస్తే బుద్దుని బోధనలను ప్రచారం చేయాలి. చార్వాకుల, లోకాయతుల ఆలోచనలను ప్రచారం చేయాలి. రామానుజుడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఏమీ పోరాడలేదు. మోక్షం పొందడానికి కులభేదం పాటించవద్దని మాత్రమే చెప్పి అష్టాక్షరి మంత్రాన్ని అందరికి ఉపదేశించాడు. గుడి, దేవుడు, పూజారి, పూజ, కులవ్యవస్థ అన్నీ కొనసాగుతూనే మోక్షాన్ని పొందేందుకు అందరూ అర్హులని చెప్పటమే అయన చేసింది. ఇక ఇక్కడ ఇప్పుడు మన జీయరు స్వామి వ్యవహారం మనందరికీ తెలిసిన విషయమే. ఈయన గారికి ప్రవచనాలలో కులవ్యవస్తను సంపూర్ణంగా సమర్థిస్తారు. కులాలు వుండాలని కోరుకుంటారు. ఇంకొక అడుగు ముందుకేసి. ప్రజల ఆహారపు అలవాట్లపైనా నీచపు వ్యాఖ్యలు చేశారు. మూఢవిశ్వాసాలను ప్రచారం చేస్తారు. వందల వేల కోట్ల రూపాయలతో ఆలయాలు, మందిరాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తారు. దీని వెనకాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు తమ తమ పనుల్ని ప్రయోజనాలను నెరవేర్చుకుంటారు.
వాస్తవంగా రామానుజుడు దేవుడు కాదు. వీళ్లిపుడు ఆయన్ని దేవున్ని చేశారు. ఆయన ఆ కాలంలో భక్త జనులకు తన ఆలోచనలను బోధించిన వాడు. వైష్ణవ భక్తిని ప్రచారం చేసినవాడు. వీర శైవానికి వ్యతిరేకంగా వీర వైష్ణవాన్ని విస్తృత పరిచేందుకు కృషి చేసినవాడే గాని మన సమాజంలో సమతను సాధించాలని, అందరూ సమానంగా జీవించాలని కోరుకుని సంస్కరించిన పని ఒక్కటీ లేదు. వైష్టవ మత విస్తరణ కోసం, మతంలోనే కొన్ని సంస్కరణలకు పూనుకున్నాడు తప్ప అసమానతలపై ఏమీ పోరాడలేదు. వీరి అనుచరులమని చెప్పుకుంటున్నవాళ్ళూ ఆచరణలో సమతా వ్యతిరేకులు, అందుకే చిత్తశుద్ధిలేని మాటలూ చేతలూ తెలుసుకుని అప్రమత్తమవ్వాలి.