Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధాలకు మూలాలు ఆధిపత్యాలే. ఆధిపత్యం ఎందుకంటే దోపిడీ కోసమే. ఇప్పటికి జరిగిన ప్రపంచ యుద్ధాలు, వివిధ సందర్భాలలో దేశాల మధ్య జరిగిన యుద్ధాలు అన్నీ పెట్టుబడి లాభాల దాహాలే కారణాలు. భౌతిక సంపదలను దోచుకోవడం, సంపద సృష్టించే ప్రజలను దోచుకోవడం, స్థూలంగా యుద్ధపు సారంలో వుండే వాస్తవాలు. యుద్ధం హింసతో కూడుకున్నది. మానవత్వాన్ని మంట కలుపుతుంది. రక్తదాహంతో కొనసాగుతుంది. యుద్ధం దేశాల మధ్య జరగొచ్చు. కానీ బలికాబడేది సామాన్య ప్రజలు. ముఖ్యంగా పిల్లలు. భావి తరాలు, మహిళలు, అణగారిన వర్గాలు. శాంతి సామరస్యాలు లేని చోట ప్రగతికి అభివృద్ధికి తావుండదు. కాలుతున్న శవాల కమురువాసన తప్ప కలల సాకారపు ఆనవాళ్లుండవు.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం రష్యా ఉక్రేయిన్ మధ్యే కావచ్చు. అక్కడ మోగుతున్న బాంబుల భయంకర ధ్వనులు ప్రపంచమంతా ఆవహిస్తుంటాయి. మన దేశాన్ని ముంచెత్తుతాయి. నాకేం సంబంధం, నా సమస్య కాదు గదా అని చాలా మందిమి అనుకుంటూ వుంటుంటాం. మనకెందుకులే అని తల తిప్పుకుంటాం కదా! తగాదాల్లోకి, గొడవల్లోకి, రాజకీయాల్లోకి వెళ్లొద్దురా అంటూ బుద్ధిమంతులై పోతున్నామనుకుంటారు చాలా మంది. కానీ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనా మన ఇంటి ముందరికి వస్తుంది. దాని ప్రభావం మన జీవనంపై కూడా పడుతుంది. ఎవడి బతుకు వాడు బ్రతుకుతున్నారని అనుకుంటున్నాం. అది వాస్తవం కాదు. పుట్టలో చీమ కుట్టటానికి, వేటకు పోయి తెచ్చిన చేపలు ఎండకపోవటానికి సంబంధమున్నట్లే, ఈ ప్రపంచీకరణలో, పెట్టుబడి విస్తరణలో విశ్వవ్యాపిత వ్యాపార సంబంధంలో, ఎక్కడ ఏమి జరిగినా అంతా చుట్టుకుంటుంది.
ఇప్పుడు చూడండి యుద్ధం ఇంకా పూర్తే కాలేదు. స్టాకుమార్కెట్లు కుప్ప కూలిపోయాయి. చిన్నచిన్న వాటాలు కొనుకున్న ప్రజల సొమ్ము ఒక్క దెబ్బకే హుష్కాకి అయ్యింది. పది లక్షల కోట్లు ఆవిరైపోయాయి. చమురు దేశాల మధ్య తగవు కాబట్టి ఎకాఎకిన బ్యారెల్ చమురు ధర నూటమూడు డాలర్లకు ఎగబాకింది. బంగారం ధర యాభై మూడు వేలు దాటి భగ్గు మంటోంది. ఇదే అవకాశంగా మన దేశ ప్రభుత్వాలు విపరీతంగా ధరలు పెంచే ప్రయత్నమూ చేస్తారు. దీంతో ప్రతి వస్తువు ధరా పెరిగిపోతుంది. సామాన్యుని జీవనం మరింత దుర్భరమవుతుంది.
ఒకప్పుడు సోవియట్ యూనియన్ పేరుతో ఒక్కటిగా వున్న దేశాలు చీలిపోయి శత్రుదేశాలుగా మారాయి. ఈ శత్రుత్వ మంటల్ని మరింత రగిల్చడానికి అగ్రరాజ్య అమెరికా ఆజ్యం పోస్తూనే వుంటుంది. రష్యాను అస్థిర పరచాలనే కుట్రతో నాటో కూటమిని ఎగదోసి ఉక్రేయిన్ను రష్యాకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నాన్ని అమెరికా చేస్తోంది. నాటో సైనిక స్థావరంగా ఉక్రేయిన్ను ఉపయోగించుకొనేందుకు, రష్యాకు అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి ఉక్రేయిన్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది అమెరికా. 2015లో ఏర్పరచుకున్న ఒప్పంధాలను ఆచరించనందుకు, తన దేశ రక్షణకు ఎదురు కాబోతున్న ప్రమాదాన్ని గ్రహించిన రష్యా సైనిక చర్యకు పూనుకున్నది.
ఏది ఏమైనా శాంతి యుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలు జఠిలమై యుద్ధానికి దారితీసాయి. ఇప్పుడు నాటో పేరుతో అమెరికా జోక్యం చేసుకుని యుద్ధంలోకి దిగితే మరింత నష్టం జరగొచ్చు. ఎంత సంయమనంతో సహనంతో యుద్ధాన్ని ఆపాల్సిన అవసరముంది. ఉక్రేయిన్లో ఉన్నత విద్య కోసం వివిధ కారణాలతో వెళ్ళిన ఇరువై వల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్న అమెరికా అబద్ధాలు ప్రచారం చేసిన అనేక దేశాల సుస్థిరతను ధ్వంసం చేసింది. అమెరికా సామ్రాజ్య వాదపు దుశ్చర్యలను ఖండించాలి. రష్యా ఉక్రేయిన్ల మధ్య తలెత్తిన సమస్యల్ని చర్చలతో పరిష్కరించాలి, శాంతి నెలకొనాలి.