Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేటీ బచావ్ అంటే కాపాడుకోవాలి అని కదా! హత్రాస్‌లో కాపాడుకోలేకపోయాం, ఉన్నావ్‌లోనూ కాపాడబడలేదు. కతువాలో కాపాడుకోలేదు. ఇంతేకాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను ఆపలేకపోతున్నాము. ఆపలేకపోవటం ఒక విషయమైతే, ఆపాలన్న ఆలోచనే లేకపోవటం మరింత ప్రమాదకరమైనది. ఆడపిల్లలను చంపిన, హింసించిన వారికి మద్దతు తెలుపుతూ ఊరేగింపులు తీసే సంస్కృతీ వారసులు నేటి మన పాలకులుగా వుండి పై నినాదాలను ఇస్తున్నారు. కళ్లముందు ఇంతటి వైరుధ్య ఆచరణ కనపడుతుండగా ఇక నినాదం నిజమెలా అవుతుంది!
కొన్ని నినాదాలు ఆకర్షిస్తాయి. అందంగానూ వుంటాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి. ఆచరణకు పురికొల్పుతుంటాయి. కానీ కొన్ని అవహేళన చేస్తాయి. సారంలేని వాటిగా వెక్కిరిస్తాయి. తాలు పదాలుగా తేలియాడుతాయి. నినాదాలపైనే కోపం వెల్లువెత్తుతుంది. నినాదానికి నిజ ఆచరణకి పొంతన కుదరక వ్యతిరిక్తంగా నిలబడితే అంతకన్నా అన్యాయం మరోటుండదు.
'బేటీ పడావ్ బేటీ బచావ్' అనే నినాదము ఇప్పుడు ఆ విధంగానే మారింది. నినాద పదాలు బాగానే వున్నాయి. ఆచరణ మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. భిన్నం కంటే, వ్యతిరేకంగా జరుగుతున్నదన్నదే నిజం. కత్తులపై పూయబడ్డ తేనేలాంటి పదాలివి. అందరి సంపూర్ణ సమ్మతికి పురికొల్పుతుంది. ఎంతో గొప్ప ఆశయం ప్రతిధ్వనిస్తుంది. అందరి హృదయాలూ కదిలిపోతుంటాయి. అందరూ ఆ నినాదం చుట్టూ తిరుగుతున్నట్టే వుంటారు. మారుమ్రోగిపోతుంది. మనందరిలోకి ప్రవహిస్తుంది. నినాదం నిత్యమూ కొనసాగుతుంది. దానికి అంతము లేదు. ఆ నినాదం అవసరం లేని సమాజం అంతకంతకూ దూరం జరుగుతూనే వుంటుంది. ఈ నినాదం మనల్ని మోసం చేస్తుంది.
బేటీ బచావ్ అంటే కాపాడుకోవాలి అని కదా! హత్రాస్‌లో కాపాడుకోలేకపోయాం, ఉన్నావ్‌లోనూ కాపాడబడలేదు. కతువాలో కాపాడుకోలేదు. ఇంతేకాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను ఆపలేకపోతున్నాము. ఆపలేకపోవటం ఒక విషయమైతే, ఆపాలన్న ఆలోచనే లేకపోవటం మరింత ప్రమాదకరమైనది. ఆడపిల్లలను చంపిన, హింసించిన వారికి మద్దతు తెలుపుతూ ఊరేగింపులు తీసే సంస్కృతీ వారసులు నేటి మన పాలకులుగా వుండి పై నినాదాలను ఇస్తున్నారు. కళ్లముందు ఇంతటి వైరుధ్య ఆచరణ కనపడుతుండగా ఇక నినాదం నిజమెలా అవుతుంది!
ఇక ఆడపిల్లలంటే, వంటింటికి, పిల్లలు కనిపెంచటానికి అని వ్రవచించే ఆలోచనా వారసత్వం నేటి ప్రభుత్వాధినేతలది. ఆడపిల్లలు బలహీనులని, ఎప్పుడూ ఎవరో ఒకరి రక్షణలోనే వుండాలని, స్వేచ్ఛగా తిరగరాదని సుద్ధులు చెబుతున్న నేతల కాలంలో బచావో అనే నినాదం, నినాదప్రాయంగానే మిగిలిపోతుంది. నీటిపై మాటలా కరిగిపోతుంది. ఆడపిల్లలు చదువులో ఇంకా ముందుకు రావలసే వున్నది. ఇంటి చాకిరికి, చిన్న పిల్లల సంరక్షణలకు, గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లల జీవితాలు ఖర్చయిపోతూనే వున్నాయి. ఇప్పుడిప్పుడే చదువుల్లోకి వస్తున్న వారిపై అనేకమైన దాడులు, వివక్షతలు కొనసాగుతున్నాయి. నిన్నగాక మొన్న చిత్తూరుజిల్లా పలమనేరులో పదవ తరగతి చదువుతున్న మిస్బా అనే బాలిక, సహచరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. కారణమేమంటే తరగతిలో ప్రథమంగా నిలవటమే. బాగా చదువులో ముందున్న మిస్బా, అతి సామాన్య కుటుంబంలోంచి వచ్చింది. ఇంత గతిలేని వాళ్లు ఈ స్కూల్లో చదవటమేంటి అని గేలి చేయటం, వేధించటం వల్ల, అదే స్కూల్లో నాయకుడి కూతురు ఉండటం, మొదటి స్థానంలోకి తన కూతురును చూసుకోవాలనే కోరికతో వేధింపుల పర్వం కొనసాగింది. చివరికి చదువుల తల్లిని హత్య చేసింది.
మరో వైపు కర్నాటకలో ముస్లిం ఆడపిల్లలు హిజాబ్ ధరించి పాఠశాలలకు, కళాశాలలకు రాకూడదని ఆంక్షలు పెట్టటమే కాకుండా అడ్డుకుంటూ పెద్ద అల్లర్లకు పాలక పార్టీలే పాల్పడి వారిని విద్యకు దూరం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే వున్నాము. అంటే మతం, కులం ఆధారంగా వివక్షతలను పెంచిపోషిస్తున్న వారు పాలనను కొనసాగిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించి, బతకనిచ్చి, విద్యా వికాసానికి తోడ్పాటునందించాల్సిన ప్రభుత్వాలు, వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ, ప్రచారం చేస్తూ, మరో వైపు బేటీ బచావ్, బేటీ పడావ్ అనే నినాదాలు ఇస్తున్నారు. అంటే చేసేది ఒకటి, చెప్పేది మరోటి. దీన్ని అర్థం చేసుకుని సమాజం చైతన్యం కావలసి వుంది.