Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భవితను ముందుకు నడిపే దృష్టి వున్నవాడే నాయకుడవుతాడు. భవిత అంటే యువతనే. మన దేశంలో యువతరంగం సమృద్ధిగానే వుంది. నడపమంటే చేయి పట్టుకు నడపటం కాదు. ముందుకు పోగల, అభివృద్ధి చెందగల ఆలోచనలు ఇవ్వటం, ఆ దారిలోకి అందరినీ నడపటం. ఒక్క యువతనే కాదు, ప్రజలందరినీ ఆ దిశగా నడిపేవాడే నిజమైన దార్శనిక నాయకుడౌతాడు. ముందుకు నడపమంటే... ఆధునిక సవాళ్ళను ఎదుర్కొంటూ అభివృద్ధిలోకి అడుగేయగలగడం. ఈ రకమైన సమగ్ర ఆలోచనలు, ఉన్నత ఆశయాలు కలిగిన నాయకులు, పాలకులు మనకున్నారా? ఇదో పెద్ద ప్రశ్న. ముందుకు నడపకపోయినా వెనక్కు తిప్పకుంటే చాలని నిట్టూర్చాల్సి వస్తోంది నేడు.
వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులు అత్యంత సంక్షోభంలో కూరుకుపోయి వున్నాయి. వీటి పర్యవసానంగా యువత మానసిక స్థితి, ప్రవర్తనల తీరు ఆందోళనకరంగా పరిణమించుతోంది. శారీరక ఆరోగ్యమూ శక్తిహీనమవుతున్నది. దేశంలో ఉద్యోగితాస్థాయి విపరీతంగా పడిపోయింది. ఉపాధి అవకాశాలు నానాటికీ హీనమవుతున్నాయి. కొత్తగా అవకాశాలు రాకపోగా వున్న కనీస ఉపాధీ అదృశ్యమవుతున్నది. దీంతో యువతలో భవిష్యత్తు పట్ల ఆందోళన పెరుగుతోంది. వొత్తిడీ అధికమవుతున్నది. దీంతో సామాజిక సౌమనస్యము దెబ్బ తింటున్నది. అంతరాలు అగాధంలా పెరుగుతున్నవి. ప్రతి శరీరానికి నిత్యం ఆహారం కావాలి. మెదడుకు ఆలోచనలివ్వాలి. ఈ రెండూ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. వీటిని పరిష్కరించే సత్తా కానీ ఆలోచన కాని పాలకులకు లేదు. అసలా దృష్టే లేదు.
అందుకే ఈ మానవ వనరు చైతన్యవంతమై, తమ అవసరాలను, హక్కులను పొందేందుకు ప్రశ్నలను సంధించకుండా, నినదించకుండా, నిలేయకుండా ఒక దుష్ట పన్నాగాన్ని పన్నారు పాలకులు. ఇందులో 'ఒకటే దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లు, ఒకటి తమపైకి ప్రశ్న తలెత్తదు, రెండోది తమ అధికారము కొనసాగించవచ్చు. అవ్వేమిటంటే.... నేటి యువతను, తమ విచ్ఛిన్న, విద్వేష ఆలోచనలకు పావులుగా వాడటం జరుగుతోంది. అందుకు వారు మతాన్ని, దేవుళ్ళని, ఆచారాలని ఆధారం చేసుకున్నారు. సాధారణంగా యువతలో వుండే ఉద్రేకం, ఆవేశం మొదలైన వాటిని ఆసరా చేసుకుని పరమత ద్వేష భావాన్ని నూరిపోస్తున్నారు. అంతేకాదు, వారికి అధికార అవకాశంతో ఆదాయాన్నో, ఆహారాన్నో సమకూర్చి విధ్వంసానికీ, అరాచకానికి పురికొల్పుతున్నారు.
దీనికి పట్టణాల్లో, నగరాల్లో, గ్రామీణంలోనూ వెనుకబడిన అణగారిన వర్గాల యువతనే ఆకర్షితమవుతున్నది. తమలో నిండుకున్న కసి, నిరాశ, నిస్పృహ, అశాంతిని, ఈ రకంగా రెచ్చగొట్టి మతోన్మాద శక్తులు వినియోగిస్తున్నవి. మనం దేశంలో జరుగుతున్న విద్వేష అల్లర్లలో యువతే కనిపిస్తున్నది. ఈ దేశ అభివృద్ధిలో తమ శక్తిని వినియోగించాల్సిన యువత మెదళ్ళను పక్కదారికి మళ్లించడం అంటే ఇదే. ఈ అరాచక ఆలోచనలకు మన యువతను బలిపెడుతున్నారు. నాయకుల, పాలకుల కొడుకులేమో ఇవ్వేమి పట్టకుండా వ్యాపారాలు చేస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు.
యువత స్థిమితంగా ఆలోచించాలి. తల్లిదండ్రులూ అప్రమత్తమవ్వాలి. ఈ రకమైన మత్తులో, భ్రమల్లో పడి శక్తియుక్తులను వృధా చేసుకోరాదు. దీని వల్ల సమాజంలో మరింత అరాచకం పెరిగి అశాంతి రేగుతుంది. అప్పుడు కనీస జీవనమూ దుర్లభమవుతుంది. పిల్లలకు, పిల్లల పిల్లలకు ఉన్నతమైన భవిత నిరాకరించబడుతుంది. అందుకే ఈ దుష్ట ఆలోచనల నుండి దూరం జరిగి దుండగాలను నిలువరించాలి.