Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలను నాన్నలు చూసే విధానము, నాన్నలని పిల్లలు చూసే విధానమూ రెండూ మారాయి. ఇవి పరస్పర ఆధారితాలు. ఇద్దరి మధ్యకూ మూడోది ప్రధానమైవచ్చి చేరుతోంది. అదీ అసలు సంగతి. ఆస్తుల తగాదాల్లో నాన్నలని చంపుతున్న కొడుకులెందరో... కులమత చట్రంలో చిక్కుకుని పిల్లల్ని కూడా హతమారుస్తున్న తండ్రులూ వున్నారు. ఇదొక వాస్తవిక విషాదం. అందుకనే సమాజంలో మనుషుల్లో, సంబంధాల్లో వస్తున్న మార్పుల అధ్యయనమూ జరగాలి. ఈ దినోత్సవాలు దానికి దోహదపడాలనీ అంటాను నేను. వ్యాపార మార్కెట్టు సరుకుల భ్రమలో పడి బహుమతులు అందజేయటం, సెలబ్రేషన్లు ఏర్పాటు చేయటం కాదు. అనుబంధాలెక్కడ, ఎందుకు కదులుతున్నాయో యోచించాలి. సంతోషాలను పంచుకోవద్దని కాదు. కానీ మానవీయ సంబంధాలను నెలకొల్పుకునే ప్రయత్నం చేయాలి.
అందరికి కేటాయించినట్లుగానే 'నాన్న'కూ ఓ రోజును ఎంపిక చేశాము. ఇక ఈ రోజున ఒక అభినందన మాలను ఆయన మెడలో వేసి మళ్ళీ మన బతుకులో మనం పడిపోతాము. నాన్ననయినా అమ్మనైనా, కుటుంబంలోని ఎవరినైనా ఎలా అర్థం చేసుకోవాలి. ఎలా చూడాలి అనేది ఒక సంప్రదాయపు అనుసరణ. అమ్మ మనకు సేవ చేస్తూ బాగోగులు చూస్తుంది. తనకు కష్టమైనా భరిస్తుంది. అందుకే అమ్మంటే అందరికీ ఇష్టమే. పెరుగుతుంటే ప్రేమలూ మారుతుంటాయి. అది వేరే అంశం. ఇక నాన్న మన అవసరాలకు బాధ్యత వహిస్తాడు. మంచి చెడ్డలను వివరిస్తాడు వీటికీ కొన్ని మినహాయింపులుంటాయి. మొత్తంగా చూస్తే ఒక ఇంట్లోనే కుటుంబం కలిసి బతుకుతుంది. అనుబంధాలు, అనురాగాలు పెనవేసుకుంటాయి. జైవికంగా నాన్న రూపు రేఖలు మనకూ వస్తాయి. అలవాట్లు నైపుణ్యాలూ అబ్బుతాయి. ఇదంతా ఒక యాదృచ్ఛికత.
నాన్నలూ మారుతుంటారు. యాభై ఏండ్ల క్రితం వున్న నాన్నలకూ నేడున్న నాన్నలకు బోలెడంత వ్యత్యాసముంది. అమ్మలకూ అంతే. ఇప్పుడు అమ్మలూ నాన్నలు సమానమవుతున్నారు. ఏమయినా అమ్మంత ప్రేమను నాన్న పొందలేకపోతున్నాడు. వెనకబడే వున్నాడు. దానికి చారిత్రక, భౌతిక కారణాలున్నాయనుకోండి. నాన్న ఒక గైడ్. మార్గదర్శకుడు. ఎందుకంటే చాలా వరకు నాన్న నుండి మనం నేర్చుకుంటాం. నిత్యం ఆయనతో సంబంధంలో వుంటాం కాబట్టి. మన సామాజిక పరిణామంలో నాన్న అనే పాత్ర ఒక విశిష్టమైనదనే చెప్పాలి. నాన్నలతో అమ్మంత దగ్గరితనం లేకపోయినా, ప్రతి నాన్నలోనూ ఒక అమ్మ వుంటుంది. దాన్ని గమనించటం ఈ సందర్భంగా పిల్లలు చేయాల్సింది. అందరూ అమ్మానాన్నల్ని అనుసరిస్తారని నేననను గానీ ఏ ఏ అంశాలు అనుసరించేవి వున్నవో తెలుసుకోవటం చేయాలి. ఎందుకంటే పిల్లలకంటే ఎక్కువగా అనుభవ పాఠాలుంటాయి కదా వాళ్ళ దగ్గర. కుటుంబ సంబంధాల్లో వచ్చిన మార్పుల వల్ల పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు కానీ, పిల్లల దగ్గర పెద్దవాళ్ళు కానీ వుండటం కనుమరుగవుతున్నది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనుబంధాలను ఆదాయాలు శాసిస్తున్నాయి. కరెన్సీ ప్రభావం మనసు పొరల్లోకి చేరింది.
పిల్లలను నాన్నలు చూసే విధానము, నాన్నలని పిల్లలు చూసే విధానమూ రెండూ మారాయి. ఇవి పరస్పర ఆధారితాలు. ఇద్దరి మధ్యకూ మూడోది ప్రధానమైవచ్చి చేరుతోంది. అదీ అసలు సంగతి. ఆస్తుల తగాదాల్లో నాన్నలని చంపుతున్న కొడుకులెందరో... కులమత చట్రంలో చిక్కుకుని పిల్లల్ని కూడా హతమారుస్తున్న తండ్రులూ వున్నారు. ఇదొక వాస్తవిక విషాదం. అందుకనే సమాజంలో మనుషుల్లో, సంబంధాల్లో వస్తున్న మార్పుల అధ్యయనమూ జరగాలి. ఈ దినోత్సవాలు దానికి దోహదపడాలనీ అంటాను నేను. వ్యాపార మార్కెట్టు సరుకుల భ్రమలో పడి బహుమతులు అందజేయటం, సెలబ్రేషన్లు ఏర్పాటు చేయటం కాదు. అనుబంధాలెక్కడ, ఎందుకు కదులుతున్నాయో యోచించాలి. సంతోషాలను పంచుకోవద్దని కాదు. కానీ మానవీయ సంబంధాలను నెలకొల్పుకునే ప్రయత్నం చేయాలి.
నాన్నది వెల్లడించలేని మనసు. అమ్మది వెల్లడించలేకుండా ఉండలేని తనం. అయినా అమ్మానాన్నలు మన జన్మకు మూలకాలు. జీవన గమనానికి దిక్సూచులు. తమ ఆశలను, కలలను పిల్లల్లో చూసుకొంటారు అమ్మానాన్నలు. గత కాలపు జ్ఞాపకాలుగా అమ్మానాన్నలను పిల్లలు చూస్తారు. ఎలా చూసినప్పటికీ నాన్నలను వారి అవసాన దశలో పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత వుంటుంది. వాళ్లూ ఒక నాటికి నాన్నలవుతారు కదా! అన్నీ పరస్పర ఆధారితాలే. అత్మీయతలు, అనుబంధాలు అన్నీ కూడా పలకరింపులు, మాటల అనుసంధానాలలోనే అల్లుకొంటాయి. మనసు విప్పి నాన్నలతో మాట్లాడండి. అప్పుడు ఎన్నో విషయాలు నాన్న అందిస్తాడు. మిమ్మల్ని ఇంతవరకు ఎదిగేట్టు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి వుండండి. నిజమైన ఆస్తులు, ఐశ్వర్యాలు అనుబంధాలే. నాన్నకు వందనాలు.