Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించేందుకు స్కావెంజర్లు, స్వీపర్లు ఉండాలి. ఈ ఏర్పాట్లు వందల పాఠశాలల్లో మనకు కనపడవు. కేవలం బిల్డింగులు, గోడలు వుండగానే సరిపోదు. నిర్వహణా ఏర్పాట్లు చాలా ముఖ్యం. ఇక అసలు విషయం ఏమంటే పుస్తకాలు అందరికీ అందాలి. పాఠాలు, అభ్యసనం కొనసాగటానికి అవి ప్రాథమికావసరం. ఇప్పటికీ అందరికీ పాఠ్యపుస్తకాలు అందలేదని తెలుస్తున్నది. తరువాత విద్యార్థులకు ఇచ్చే యూనిఫారమ్ దుస్తులు ఈ సంవత్సరం ఇంకా కుట్టటానికి ఇవ్వలేదని తెలిసింది. వీటన్నింటిని సమకూర్చు కొనడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. ఇక మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా సరైన చర్యలూ ప్రణాళికా లేదనే అర్థమవుతున్నది. భోజన తయారిదార్లకు సకాలంలో వారి వేతనాలను ప్రభుత్వం అందించటమే లేదు.
బడులు ఆరంభమయ్యాయి. పాఠాలూ మొదలయ్యాయి. పిట్టల్లాంటి పిల్లల కేరింతలు, గంతులు, ఆటలు పాటలు, కబుర్లు స్నేహాలు ఎన్నో... పాఠశాలలు ముందు పూలవనం చరిస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రెండు వారాలు గడిచి కాలం వేగం పుంజుకుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత బడి రుతువు సమయానికే గంట మోగటం ఇప్పుడే జరిగింది. సరే మళ్ళీ కరోనా కొంత పెరుగుతోందని వార్తలు వస్తున్నా పెద్ద ప్రభావాన్ని కలిగించదనే విశ్వాసం మనందరిలోనూ వుంది. ఒకవేళ పెరిగినా ఎదుర్కోగలమనే ధైర్యమూ వచ్చి వున్నాము.
అదలా వుంచితే, బడిలో అనేకానేక సమస్యలూ స్వాగతం పలుకుతున్నాయి. ఇవి ఇప్పుడే వచ్చినవీ కావు. చాలా ముఖ్యమైన విషయమేమంటే బడి వాతావరణం, పరిసరాల పరిశుభ్రత మంచిగా వుంచటం. వర్షాకాలంలో బడులు మొదలవుతాయి. తడితడిగా వుంటుంది. వ్యాధులు ముసురుకునే కాలం కూడా ఇదే. ప్రధానంగా తాగే నీళ్లు, పరిశుభ్రత రోగాల విజృంభణకు కారకమవుతాయి. పాఠశాలల్లో పిల్లలు తాగే మంచి నీటిని కలుషితం కాకుండా లేకుండా అందించగలగాలి. ఈ వసతి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయో పర్యవేక్షించవలసి వుంది. దాదాపు ఎనభై శాతం రోగాలు నీటి సమస్యతోనే వస్తుంటాయి. ఇక రెండవది పరిసరాల పరిశుభ్రత, మూత్రశాలలు నిర్వహణ అంశాలు. ఇవి సరిగా చూడకపోతే ఎన్నో అనర్థాలు ఎదురౌతాయి. అన్నీ పాఠశాలల్లో ఈ సౌకర్యాలు లేవు. ఉన్న చోట వాటి నిర్వహణకు అవకాశం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నది. మొన్న ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పాము కరచి విద్యార్థిని చనిపోయిందనే వార్త తల్లిదండ్రులను కలవరానికి గురి చేసింది. పరిసరాలను ప్రమాదాలు లేని విధంగా, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గురుకులాలలో విద్యార్థుల బాగోగులు చూస్తూ నిత్య పర్యవేక్షణ చేయటం అవసరం.
ఇక పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించేందుకు స్కావెంజర్లు, స్వీపర్లు ఉండాలి. ఈ ఏర్పాట్లు వందల పాఠశాలల్లో మనకు కనపడవు. కేవలం బిల్డింగులు, గోడలు వుండగానే సరిపోదు. నిర్వహణా ఏర్పాట్లు చాలా ముఖ్యం. ఇక అసలు విషయం ఏమంటే పుస్తకాలు అందరికీ అందాలి. పాఠాలు, అభ్యసనం కొనసాగటానికి అవి ప్రాథమికావసరం. ఇప్పటికీ అందరికీ పాఠ్యపుస్తకాలు అందలేదని తెలుస్తున్నది. తరువాత విద్యార్థులకు ఇచ్చే యూనిఫారమ్ దుస్తులు ఈ సంవత్సరం ఇంకా కుట్టటానికి ఇవ్వలేదని తెలిసింది. వీటన్నింటిని సమకూర్చుకొనడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. ఇక మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా సరైన చర్యలూ ప్రణాళికా లేదనే అర్థమవుతున్నది. భోజన తయారిదార్లకు సకాలంలో వారి వేతనాలను ప్రభుత్వం అందించటమే లేదు. వేతనాలు ఇస్తేనే బడి తాళాలు తెరుస్తామని మొన్నొక ఊరిలో వాళ్లు డిమాండ్ చేయటాన్ని బట్టి పరిస్థితి అర్థమవుతుంది. మొన్న బాసరలో విద్యార్థులంతా తమ సమస్యలు పట్టించుకోవాలని తీవ్ర పట్టుదలతో ధర్నాకు దిగితే తప్ప మంత్రులు, అధికారులు కదలలేదు.
పాఠాల నిర్వహణకు కీలకమయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమస్య పరిష్కారం కాక, గురువులు అస్థిరతలోనే వుండి ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజులు, వాటి నియంత్రణలకు సంబంధించి ఏదీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు. ఆ వ్యాపార దోపిడి కొనసాగుతూనే వున్నది. మొత్తానికి విద్యారంగ ప్రాధాన్యతను గుర్తించి, దాని పట్ల శ్రద్ధ వహించటం, ప్రణాళిక రచించటంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే వున్నాయి. భావి తరాలను తీర్చిదిద్దే ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, భవితను నిర్లక్ష్యం చేసినట్లే. బడులు కేవలం పాఠాల కేంద్రాలే కాదు, భావి తరాల నిర్మాణ కేంద్రాలు.