Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానలు పడుతుండగానే బడులకు సెలవులు వస్తాయనే విషయం బాలలందరికీ తెలిసే వుంటుంది. అందుకేనేమో వర్షం అంటే పిల్లలకంత హర్షం. ఇంకా కొన్ని అబ్బురపరచే జల్లులు పడేవి అదే రాళ్లవాన. మంచుగడ్డలు పడుతుంటే పరుగెత్తుకెళ్లి వాటిని ఏరు కోవటం, నోట్లో వేసుకోవటం, గిన్నెల్లో వేసి ఆడుకోవడం ఎంత సరాదాగా ఉండేది. వేడి వేడి వేయించిన వేరు శనగపప్పులు, నిప్పులపై కాల్చిన మక్కజొన్న కంకులు ముంచెత్తుతున్న వానకు మరింత రుచిని పెంచేవి. తడిచిన దేహాల అల్లరి చేష్టలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయితే నానమ్మ చెబుతుండేది కలిగినోడికి వానాకాలమంత సుఖం లేదు అని. లేనోడికి మాత్రం ఇంట్లో పిల్లి లేవడమే కష్టమనీ వ్యాఖ్యానించేది. చిన్నతనంలో ఏమీ అర్థం కాకపోయినా, ఇపుడు మాత్రం స్పష్టంగా తెలిసి వచ్చింది.
వర్షమయినా, ఆలోచనలయినా, భావాలయినా, ఆనందాలయినా ఏవైనా ముసురుకోవటంలో, వ్యాపించడంలో, ముంచెత్తడంలో, తెరిపి లేకుండా కొనసాగడంలో ప్రయోజనాలతో పాటు, కొన్ని ఇబ్బందులూ వుంటాయి. మనలాంటి సమాజాల్లోనయితే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ముసురులా ముంచెత్తుతాయి. జీవితాలు ముసురులోనే ముగియవచ్చు. జీవన నైపుణ్యాలన్నీ వెలికి వచ్చేది మాత్రం ముసురుకున్న సవాళ్ళలోంచే అవి భరించలేని తనంలోంచే పోరాటమూ తలెత్తుతుంది. దాంతోనే ఒక అడుగు ముందుకు పడుతుంది. సమాజ గమనమూ మారుతుంది. అందుకే ఈ ముసురులేవీ సామాన్యులకు కొత్తకాదు.
ఇప్పుడు మనం మునుగుతున్నది మాత్రం ముసురుకున్న వానలోనే. వారం రోజులుగా తడిసి ముద్దవుతున్నాము. తడవటం, ముసురులో ఆడటం పిల్లలకు భలే సరాదాగా వుంటుంది. తడి సంతోషాన్నిస్తుంది. చెమ్మదనం, ఎప్పుడూ కమ్మదనంగానే వుంటుంది. తడిగల గుండెల్నే మనం కోరుకుంటాము కూడా. మనసు నిండా చల్లదనముంటే దరి చేరేవారు కోకొల్లలుగా వుంటారు. పొడితనం, మనసును విరిగేట్లు చేస్తుంది. పొడిపొడి మాటలూ అంటీ అంటని అనుబంధాలుగానే వుంటాయి. చల్లదనాల హృదయ స్పందనలలోంచే వేడిగానైనా కన్నీళ్లు పెల్లుబుకుతాయి. తడిగళ్ల గుండెలే ఎదుటి వారి బాధలకు తల్లడిల్లుతాయి. ఆగ్రహావేశాల జ్వాలను ఆలోచన వైపు మరల్చేది చల్లని హృదయాలే. ఆచరణాత్మక విప్లవ భావాల ముసురు ఇపుడెంతో ఆవశక్యము. ఇవన్నీ కొన్ని బరువైన విషయాలు.
కానీ ముసురును చూడగానే ఎన్నో బాల్యపు జ్ఞాపకాలూ కళ్లముందు కదలాడుతుంటాయి. వర్షం పడగానే కాగితంప్పడవల ప్రయాణాలు ఎంత మధురమైన గుర్తు. వానలు పడుతుండగానే బడులకు సెలవులు వస్తాయనే విషయం బాలలందరికీ తెలిసే వుంటుంది. అందుకేనేమో వర్షం అంటే పిల్లలకంత హర్షం. ఇంకా కొన్ని అబ్బురపరచే జల్లులు పడేవి అదే రాళ్లవాన. మంచుగడ్డలు పడుతుంటే పరుగెత్తుకెళ్లి వాటిని ఏరు కోవటం, నోట్లో వేసుకోవటం, గిన్నెల్లో వేసి ఆడుకోవడం ఎంత సరాదాగా ఉండేది. వేడి వేడి వేయించిన వేరు శనగపప్పులు, నిప్పులపై కాల్చిన మక్కజొన్న కంకులు ముంచెత్తుతున్న వానకు మరింత రుచిని పెంచేవి. తడిచిన దేహాల అల్లరి చేష్టలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయితే నానమ్మ చెబుతుండేది కలిగినోడికి వానాకాలమంత సుఖం లేదు అని. లేనోడికి మాత్రం ఇంట్లో పిల్లి లేవడమే కష్టమనీ వ్యాఖ్యానించేది. చిన్నతనంలో ఏమీ అర్థం కాకపోయినా, ఇపుడు మాత్రం స్పష్టంగా తెలిసి వచ్చింది. రోజు కూలీలు, పొలాల్లో పని చేసే వాళ్లు, పనులన్నీ ఆగిపోగా రోజువారీ అవసరాలను తీర్చుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. తిండికి సైతం కటకటనే. అంతేకాదు, చిన్న చిన్న గుడిశెల్లో, పూరిపాకల్లో, మట్టిగోడల మధ్య కాలం గడిపేవారు, నిద్రలు మాని కాపలాలు కాయాల్సిందే. మీ కన్నీళ్లకు మేం తోడవుతాం అంటూ వాన నీళ్లూ గుడిసెల్లోకి దూరి పలకరిస్తుంటాయి. గోడలు కూలి ప్రాణాలు పోయేవారూ, గాయాల పాలయ్యేవారూ కనపడతారు. మండని పొయి కట్టెల పొగ చూరిన బతుకులపై ముసురుకునే బాధలు ఎన్నో ఎన్నెన్నో.
అంతేకాదు, డెబ్బయేండ్ల స్వతంత్రంలో నడిచొచ్చాక 'మంచి' నీళ్లు అందక, మురికి నీళ్ల సేవనంలో ముసిరే జబ్బులూ, దోమలు, ఈగల దాడిలో వెల్లువెత్తే వ్యాధులు చెప్పనలవి కాదు. పేదరికం చుట్టూతానే ఇవన్నీముసురుకుంటాయి. వెచ్చగా పదిలంగా గడిచిపోయే వారికి వాన చినుకుల పలకరింపు సంతోషంగానే వుంటుంది. జీవన పోరాటాల సమూహానికి ఇదో సవాలుగా నిలుస్తుంది. పాదుకొన్న మురికిని, పరుచుకున్న మలినాలను ఆవేశంగా కడిగిపారేస్తున్నట్టు వరదలు ముంచెత్తుతాయి. కాలువలు పరుగులు తీస్తాయి. హెచ్చరికల చప్పుళ్లు చేస్తూ నదులు నినదిస్తాయి. ప్రకృతికీ అప్పుడప్పుడు కోపం వస్తుంది. మానవ నడవడి సవ్యంగా లేనపుడు యేరు సైతం ప్రశ్నయి నిలుస్తుంది. ఆ పాఠాన్ని మనమూ అర్థం చేసుకోవాలి.