Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజన్ కూడా పొరపాటున మాట దొర్లిందని, నాకు హిందీ భాష సరిగా రాదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదని వివరణ ఇచ్చారు. అయినా గందరగోళం కొనసాగుతూనే వున్నది. స్త్రీలన్నా, ఆదివాసీలు, గిరిజనులు అన్నా మీకు గౌరవం లేదని అధికార పక్షం విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ గొడవంతా దేశంలోని కోట్లాది ప్రజల ధరల సమస్యను పక్కదారి పట్టించింది. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బయట పెరిగిన ధరల మీద, ప్రజలపై భారాలపైనా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడా ఎజెండా మారిపోయింది. అంతేకాదు, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూతురు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్‌ను ఫేక్ వివరాలతో నడుపుతున్నదన్న విషయంపైనా పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంలో, రాష్ట్రపతి సంబోధన అంశం వాటన్నింటినీ పక్కకు తోసింది.
మన దేశానికి కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆదివాసి సంతతి తెగకు చెందిన మహిళ అత్యున్నత పదవికి ఎన్నికవడం ఇది మొదటిసారి. వారికి సోపతి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నది. మన రాజ్యాంగం ప్రకారం దేశానికి ప్రథమ పౌరురాలు ఆమె. ఈ దేశ అధిపతి కూడా ఆమే. అయినప్పటికి అసలైన అధికారాలు, ఆధిపత్యం, పరిపాలనా పగ్గాలు అన్నీ ప్రధానమంత్రి చేతిలోనే వుంటాయి. రాష్ట్రపతి పదవి విశేష అధికారాలు కలిగి వున్నప్పటికీ అవి అలంకార ప్రాయమైనవే. ప్రభుత్వం సూచించిన మేరకు నడుచుకోవటమే జరుగుతూ వుంటుంది. కొందరైతే రాష్ట్రపతి పదవి రబ్బరు స్టాంపులాంటిదేనని వర్ణిస్తుంటారు. అవును రాజముద్ర లేకుండా ఏదీ చట్టము కాబోదు కదా! అయితే ఇపుడు రాష్ట్రపతి అధికారాల గురించి చర్చ కాదు గానీ, ఇపుడు రాష్ట్రపతి ముర్మును రాష్ట్రపత్నిగా సంబోధించిన అంశంపైనే రగడ జరుగుతున్నది.
రాష్ట్రపతి అనే పదం హిందీ పదంగా మనం వాడుతున్నాం. సంస్కృత శబ్ద ప్రయోగంలోంచి వచ్చినది. రాష్ట్ర+పతి, రాష్ట్రస్యపతి:పాలక: పుమాన్ అంటే రాష్ట్రమును పాలించువాడు అని అర్థం. దీనినే రాష్ట్ర+పతి, రాష్ట్రస్యపతి: పాలయిత్రీ స్త్రీ - రాష్ట్రమును పాలించు స్త్రీ. పులింగమందైనా స్త్రీలింగమందైనా రాష్ట్రపతి అనే పదమే వాడబడుతుంది. రాజ్యాధిపతి అని దాని అర్థం. కానీ పతి అనగానే భర్త అని భావించి, స్త్రీ కనుక పత్ని అని వాడటం తప్పు. పతి అంటే సంస్కృతమున ఏలిక, కాపాడువాడు, రాజు, మగడు, పాలించునది అని కూడా అర్థం. మన సమాజమున భార్యను ఏలుకునే వాడు కావున పతి, మగడు, భర్త అనే అర్థంగా వాడుచున్నాం. పురుషాధిక్య సమాజంలోంచి వచ్చిన పదవులూ, భాష కూడా. ఏలికకు సంబంధించిన పదాన్ని స్త్రీ పురుష లింగాలు ఆధారంగా మలచివాడుకొనటం ఇక్కడ తగని పని. భూపతి, జగపతి, గోపతి, అధిపతి గణపతి మొదలైన పదాల అర్థమంతా అధిపతి అని అంటే పాలకుడూ, ఏలికా అని చెప్పుకోవాలి తప్ప భూమి భర్త అని, జగానికి భర్త అని, గోవుల భర్త అని చెప్పుకోవటం మూర్ఖత్వమవుతుంది. తప్పుడు సూత్రీకరణ కూడా. ఈ విషయాలన్నీ తెలవక పతి అని వుంది కాబట్టి, ఈమె స్త్రీ కనుక పత్ని అని పిలువడం మిడిమిడి జ్ఞానానికి నిదర్శనం. ఆంగ్లంలోనైతే ప్రెసిడెంట్ అని పిలుస్తాం. దీనికి తెలుగు చేస్తే అధ్యక్షుడు, అధ్యక్షురాలు - డు, ఆలు అనేవి తెలుగు భాషలో లింగవచన సూచికలు.
ఇదంతా భాషాపరమైన చర్చ అనుకోండి. కానీ అసలు విషయం ఏమంటే, స్త్రీవాచికంగా సంబోధించటంలో ఒక తేలికతనమూ వ్యంగ్యమూ గోచరిస్తుంది. పార్లమెంటు వెలుపల సభాపక్షనేత అధీర్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రకంగా సంబోధించడంతో పార్లమెంటులో పెద్ద రభసకు దారితీసింది. అధికార పక్ష మహిళా సభ్యులు తీవ్రంగా స్పందించారు. సభలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆఖరికి అధిర్ రంజన్ కూడా పొరపాటున మాట దొర్లిందని, నాకు హిందీ భాష సరిగా రాదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదని వివరణ ఇచ్చారు. అయినా గందరగోళం కొనసాగుతూనే వున్నది. స్త్రీలన్నా, ఆదివాసీలు, గిరిజనులు అన్నా మీకు గౌరవం లేదని అధికార పక్షం విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ గొడవంతా దేశంలోని కోట్లాది ప్రజల ధరల సమస్యను పక్కదారి పట్టించింది. గత కొన్ని రోజులుగా పార్లమెంటు బయట పెరిగిన ధరల మీద, ప్రజలపై భారాలపైనా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడా ఎజెండా మారిపోయింది. అంతేకాదు, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూతురు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్‌ను ఫేక్ వివరాలతో నడుపుతున్నదన్న విషయంపైనా పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంలో, రాష్ట్రపతి సంబోధన అంశం వాటన్నింటినీ పక్కకు తోసింది.
అధిర్ రంజన్ సంబోధన ముమ్మాటికీ ఖండించవలసిన అంశమే. అతను కూడా క్షమాపణ చెప్పాలి. అంతటితో అది ముగిసిపోవాలి. దళితుల, ఆదివాసీల పట్ల చిన్న చూపు కలిగి వుండటమనేది సర్వత్రా వున్న విషయం. మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్‌ను గుడిలోకే రానివ్వకుండా, గుడి బయటనే పూజలు చేయించిన విధానాన్ని మనం చూసే వున్నాం. అలంకార ప్రాయమైన పదవులలో అణగారిన వర్గాలను కూచోబెట్టి, పాలనలో వారికి ప్రాతినిధ్యము కలిగిస్తున్నామని చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడే విషయంగా రాజకీయాలు కొనసాగటం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సంబోధనలే కాదు, సంవేదనలను అర్థం చేసుకుని స్పందించాల్సి వుంటుంది. అసలు విషయాలను వొదిలేసి అనవసర వ్యాఖ్యానాలతో కాలం గడపరాదు.