Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాల్లు మనకు స్తూపాల రూపంలో, శిథిల గడీల రూపంలో కనపడుతూనే వుంటాయి. అంతేకాదు, ఆ పోరాట కాలంలో పాల్గొన్న కార్యకర్తలు కళారూపాలను, పాటల్ని సృష్టించుకున్నారు. అవి ఇప్పటికీ సజీవంగా వున్నాయి. చరిత్రను నమోదు చేసినవిగా కూడా ఆ గీతాలు ధ్వనిస్తాయి. యాదగిరి రాసిన 'బండెనుక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడుకో, నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ, నువ్వుండేదైదరాబాదు, దాని పక్కా గోలుకొండ, గోలుకొండా ఖిల్లాకింద, నీ గోరి కడ్తం కొడుకో...' అని గొంతెత్తిన సమూహం సింహగర్జన చేసింది. ''నైజాము పాలనా ఉయ్యాలో, నరకాసురుని పాలన ఉయ్యాలో, పసి పిల్లల తల్లుల్ని ఉయ్యాలో జుట్టుపట్టి ఈడ్చిరి ఉయ్యాలో...'' అంటూ మహిళలూ పాటలు కట్టి నాటి దొరల దాష్టీకాన్ని ప్రజలకు తెలియపరచి, యుద్ధానికి సన్నద్ధం చేశారు.
కొత్తగా ఎన్ని వాదనలైనా రావొచ్చు. చరిత్రపై చిన్నచూపూ కలగొచ్చు. తమకు నచ్చని గతంపై బురద చల్లటం, కొత్త ప్రవచనం మొదలెయ్యటం వక్రశక్తులకు వెన్నతో పెట్టిన విద్య. అలా చేసే వాళ్లంతా హీనచరితులే అయి వుంటారు. చరిత్రపై బలప్రయోగం చేయటం, చెరిపేసి కొత్త చరితను పులమటం నేడు విపరీతంగా పెరిగింది. 'కాలదన్నితే చేసిన త్యాగం ధూళిలో కలసిపోదు'... అని కవిపాడుకున్నట్లుగానే చరిత్రను, అందులోని సత్యాలను చెరిపేయటం ఎవరి వల్లాకాదు. తెరలు కప్పగలరు కాని తొలగించటం సాధ్యపడదు. అందులోనూ ఓ మహత్తర ఉద్యమం తాలూకు ఘటనల్ని, పరిణామాలను మసిపూసి మారేడు గాయి చేయాలనుకోవడం కుదరనిపని.
తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు, ఈ నేల గురించిన గతాన్ని తప్పక తెలుసుకుని తీరాల. ఎందుకంటే మనం దాని వారసులం గనుక. ఇప్పుడు మన చరిత తెలుసుకోవాల్సిన అవసరమేమొచ్చిందంటే, సెప్టెంబర్ 17న పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. 1948లో హైద్రాబాద్ సంస్థానంగా వున్న మన తెలంగాణను భారత ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నరోజది. మరాఠాలోని, కర్ణాటకలోని కొన్ని జిల్లాలతో పాటు మొత్తం 16 జిల్లాలతో ఆనాటి సంస్థానం నైజాం నవాబు ఆదీనంలో ఉండేది. నైజాము ఏలుబడిలో జాగీర్దారులు, దేశ్ముఖ్లు, జమీందారులు ఇక్కడి ప్రజలను, రైతులను నానా ఇక్కట్లకు గురి చేయటమేకాక దోపిడీ దౌర్జన్యానికి పాల్పడినారు. దానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ, సంఘం పేరుతో నిరసన పెల్లుబికి చివరకు కమ్యూనిస్టుల నాయకత్వాన సాయుధ పోరాటం వెల్లువెత్తింది. కమ్యూనిస్టులు విస్తరిస్తే ప్రమాదమని భావించిన కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు పూనుకుని, కమ్యూనిస్టులపై, ఉద్యమకారులపై విరుచుకుపడింది. వేలాది మంది ప్రజలు అమరులైనారు. సైన్యాన్ని ఎదుర్కొంటూనే 1951 వరకూ పోరు కొనసాగింది. అంతేకాని విమోచన జరగనేలేదు. విలీన ప్రక్రియ ముగిసింది. ప్రజా పోరును అణచటమే ధ్యేయంగా పటేలు దాడి జరిగింది. ఇది స్థూలంగా చరిత.
అత్యంత సామాన్యులు, నీ బాంచను కాల్మోక్తా అని బతుకులీడ్చిన జనం వీరోచితంగా ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాల్లు మనకు స్తూపాల రూపంలో, శిథిల గడీల రూపంలో కనపడుతూనే వుంటాయి. అంతేకాదు, ఆ పోరాట కాలంలో పాల్గొన్న కార్యకర్తలు కళారూపాలను, పాటల్ని సృష్టించుకున్నారు. అవి ఇప్పటికీ సజీవంగా వున్నాయి. చరిత్రను నమోదు చేసినవిగా కూడా ఆ గీతాలు ధ్వనిస్తాయి. యాదగిరి రాసిన 'బండెనుక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడుకో, నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ, నువ్వుండేదైదరాబాదు, దాని పక్కా గోలుకొండ, గోలుకొండా ఖిల్లాకింద, నీ గోరి కడ్తం కొడుకో...' అని గొంతెత్తిన సమూహం సింహగర్జన చేసింది. ''నైజాము పాలనా ఉయ్యాలో, నరకాసురుని పాలన ఉయ్యాలో, పసి పిల్లల తల్లుల్ని ఉయ్యాలో జుట్టుపట్టి ఈడ్చిరి ఉయ్యాలో...'' అంటూ మహిళలూ పాటలు కట్టి నాటి దొరల దాష్టీకాన్ని ప్రజలకు తెలియపరచి, యుద్ధానికి సన్నద్ధం చేశారు.
ఒక్క తెలంగాణలోనే కాదు, ఇక్కడి పోరాటాన్ని విని స్పందించిన వారెందరో వున్నారు. బెంగాలుకు చెందిన హరీంద్రనాథ చటోపాధ్యాయ - 'నీ చిత్రవధలో వాళ్ళ రక్తమాంసాల్ని, ఛిద్రం చేస్తావేమో, కానీ వాళ్ల ఆత్మబలాన్ని కాదు' అని త్యాగాలను కీర్తించారు. సుంకర సత్యనారాయణ, భాస్కరరావులు రచించిన 'మా భూమి' నాటకం ప్రజల గుండెల్ని కదిలించింది. 'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు' అని ఎలుగెత్తారు సోమసుందర కవి. 'ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించాడు దాశరథి. 'పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరసీ ఎన్నాళ్లయిందో' అని పాడాడు సుద్దాల హనుమంతు. అంతేకాదు పోరాట ఘట్టాలకు చిత్రిక పట్టాడు చిత్తప్రసాద్. ఆరుద్ర 'త్వమేవాహమ్' కుందుర్తి 'తెలంగాణ' కావ్యాలను వెలువరించారు. ఇన్ని సాక్ష్యాలు సాహిత్యంలో, వీరోచిత సమరాన్ని నిక్షిప్తం చేసాయి. ఇప్పుడు వచ్చిన విద్వేష చరితులు వక్రీకరిస్తే ఎలా మాసిపోతుంది సత్యం. అరుణ అమర గీతాలలో సజీవమై నిలిచిన చైతన్యం తెలంగాణ నేలలో వారసత్వంగా నిలిచే వుంది. దీనిని చెరిపేయటం ఎవరి వల్లా కాదు.