Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుడిహత్నూర్
మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం ఎంపిడిఓ సమావేశ మందిరంలో ఎంపిపి భరత్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో ఎటువంటి అభివృద్ది పనులు చేయాలన్న స్థానిక సర్పంచ్లు తీర్మానాలు ఇవ్వకుండా అభివృద్దికి అడ్డుపడుతున్నారని ఎంపిటీసీలు అరోపించారు. సర్పంచ్లకు తెలియకుండా, కనీసం ముందస్తు సమాచారం ప్రోసిడింగ్ చూపకుండా గుడ్డిగా ఎలా తీర్మానం ఇస్తారని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తిరుమల్గౌడ్ ఎంపిటీసీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ తీగలు ఊగుతున్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గర్భిణులకు వైద్య సేవలు సక్రమంగా అందించడం లేదని సర్పంచ్ తిరుమల్ గౌడ్ వైద్యురాలు నీలోఫర్ దృష్టికి తీసుకొచ్చారు. గత సమావేశాల్లోనూ మిషన్ భగీరథ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారంలో ఆర్బ్ల్యూఎస్ ఏఈ ఆదిత్య విఫలమయ్యారని మహిళా సర్పంచులు అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి గైరాజరైన అధికారులకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని పలువురు సర్పంచులు ప్రశ్నించారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ పనుల పురోగతిని వివరించారు. సమావేశంలో ఎంపీడీవో సునీత, తహసీల్దార్ సంధ్యారాణి, జడ్పిటిసి పతంగే బ్రహ్మానంద్, కో అప్షన్ సభ్యుడు జమీర్, పిఎసిఎస్ చైర్మన్ సంజీవ్ కుమార్ వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.