Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి
నవతెలంగాణ-దండేపల్లి
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంతోపాటు మామిడిపల్లి, మోకాసిగూడ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో సదరు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిపాలన అనుమతులు వేగవంతంగా ఇవ్వాలని, పనుల అంచనాలకు సంబంధించి ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మంజూరు చేయాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తప్పుడు అంచనాలు వేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.