Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం కుంభకోణంలో అసలు సూత్రదారులెవరు?
- రైస్ మిల్లర్ల పాత్రపై సర్వత్రా సందేహాలు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
తీగ లాగితే డొంక కదులుతుందనేది సామెత. కాని ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన బియ్యం కుంభకోణంలో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీగ లాగి కుంభకోణాన్ని బహిర్గతం చేశారు. కాని డొంక కదిలి అసలు సూత్రదారులు బయటకు వస్తారా అనేది ఇక్కడ సందేహంగా మిగిలింది.
ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన బియ్యం కుంభకోణం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 8,400 క్వింటాళ్ల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్‌కు రాకున్నా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించి సుమారు రూ.3కోట్ల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన విషయం తెల్సిందే. ఈ తతంగం ఒక్క రోజులో జరిగింది కాదు. గత కొన్ని నెలలుగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఉన్నతాధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి గోపినాథ్‌ను సస్పెండ్ చేశారు. కాని దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడితే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జే ఇంత పెద్ద మొత్తంలో నిధుల స్వాహాకు పాల్పడడమంటే అది అసాధ్యమే అని చెప్పవచ్చు. సస్పెన్షన్‌కు గురైన ఇన్‌ఛార్జిని ఉన్నతాధికారులు విచారిస్తే అసలు సూత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
అధికారులపై పెరుగుతున్న రైస్ మిల్లర్ల ఒత్తిళ్లు
రైస్ మిల్లుల నుండి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించే బియ్యం విషయంలో అధికారులపై రైస్ మిల్లర్ల నుండి ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బియ్యం సరఫరా విషయంలో తమకు సహకరించి అధిక మొత్తంలో బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్లోని ఒక ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జిపై ఇదే రీతిలో ఒక అధికారపార్టీ నేత ఒత్తిడి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇన్‌ఛార్జి దీనికి అంగీకరించకపోవడంతో అతన్ని ఇక్కడి నుండి బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే రీతిలో ఒత్తిళ్లకు లొంగి జిల్లాలో పలువురు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జిలు తగిన మూల్యం చెలించారు. గతంలో బెజ్జూరు ఎంఎల్ఎస్ పాయింట్లో రూ. 57 లక్షల మేర అవకతవకలు జరగగా, అప్పటి ఇన్‌ఛార్జిని సస్పెండ్ చేశారు. 2014లో జైనూర్ ఎంఎల్ఎస్ పాయింట్లో రూ. 10 లక్షల మేర అవకతవకలు జరగగా ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌కు గురయ్యాడు. 2019లో సిర్పూరు (టి) ఎంఎల్ఎస్ పాయింట్లో రూ. 25 లక్షల మేర అవకతవకలు జరగగా ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌కు గురయ్యాడు. తాజాగా ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జి కూడా ఇదే రీతిలో అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యాడు.
కొరవడిన పర్యవేక్షణ
ఎంఎల్ఎస్ పాయింట్లు, రైస్ మిల్లులను తరచుగా తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రతి నెలా ఉన్నతాధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లను, రైస్ మిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. రైస్ మిల్లుల యాజమానులు ప్రతి నెలా స్టాక్ వివరాలను స్థానిక తహసీల్దార్లకు అందజేయాలి. రైస్ మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉన్నా, అది సరైన రీతిలో పర్యవేక్షణ చేయడం లేదు. ఈ విభాగంలో ఒక డిప్యుటీ తహసీల్దార్‌తో కూడిన బృందం తరచుగా తనిఖీలు చేయాలి. కాని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇలాంటి అవకతవకలకు దారి తీస్తోంది.