Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పద స్థలానికి పరిహారం పట్ల అభ్యంతరం
- తీర్మానాన్ని వ్యతిరేకించిన అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అభివద్ధి పనులకు కేటాయించిన నిధులను పురపాలకవర్గం ఆమోదించింది. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెండాలో పేర్కొన్న పలు అంశాలను పాలవర్గం ఆమోదించింది. 15వ ఆర్థిక ప్రణాళిక నిధుల ద్వారా నిర్వహించే బస్తి దవఖానను 5 వార్డులో ఆరోగ్య సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పట్టణంలోని వివిధ వార్డుల్లో నీటి సరఫరా కోసం రూ.6.11 లక్షల నిధులతో చేపట్టే పనులకు, ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంబంధించి రూ.61.600 ఖర్చును కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం పట్ల ఆయా వార్డుల కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వార్డుల్లో నెలకొన్న సమస్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కౌన్సిల్ సభ్యులు సమావేశంలో అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.
వివాదాస్పద స్థలంపై అభ్యంతరం..!
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద మెడిలైఫ్ హాస్పటల్ వైపు వెళ్లే రహదారికి ఆటంకంగా మారిన వివాదాస్పద స్థలం పరిహారం చెల్లింపు విషయంలో కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఏకగ్రీవంతో టేబుల్ అజెండా రూపంలో వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిపారు. రహదారికి ఆటంకంగా ఉన్న స్థలం కోసం సుమారు రూ.6.30 కోట్ల నిధులను పరిహారం రూపంలో సంబంధిత స్థలం యజమానికి ఇచ్చేందుకు అజెండాలో ప్రతిపాదించగా కౌన్సిలర్లు మూకుమ్మడిగా అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. సమావేశానికి ముందు ఎజెండాలో ఈ విషయాన్ని తెలియజేయకుండా టేబుల్ అజెండా రూపంలో ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసం అని కౌన్సిలర్లు ప్రశ్నించినట్లు తెలిసింది. మాస్టర్ ప్లాన్లో అనేక ప్రాంతాల్లో వివాదాస్పద రోడ్లు ఉన్నాయని వాటికి కూడా ఇదేవిధంగా చెల్లిస్తే మున్సిపల్ ఖజానా గండిపడుతుందని పలువురు కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని వచ్చే కౌన్సిల్ సమావేశానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, కమిషనర్ బాలకృష్ణ పాల్గొన్నారు.