Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్
- ఘనంగా 24వ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని కుల వివక్ష పోరాట సమితి(కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ పునరుద్గాటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో ఆదివారం కేవీపీఎస్్ 24వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన అనే లక్ష్యాల కోసం మహాత్మజ్యోతిబాపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సంఘం పోరాడుతోందన్నారు. 24 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించేందుకు ప్రధాన భూమిక పోషించిందని, జస్టిస్ పున్నయ్య కమిషన్ స్మశాన వాటిక స్థలాల జీఓ 1235 సాధించిందన్నారు. కులవివక్ష అంటరానితనంపై అసమానతలపై రాజీలేని ఉద్యమాలు నడిపిందన్నారు. కుల దురహంకార దాడులు హత్యలు ఎక్కడ జరిగిన ముందు ఉంటూ పోరాడుతామన్నారు. నేడు కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ మతోన్మాద విధానాలతో దళితులపై అనేక రూపాల్లో సామాజిక అణిచివేతలు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెరిగేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారిచే కుటిల యత్నాలు చేస్తున్నారని, భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి చేస్తూ దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ దళితులను అన్ని రంగాలలో నిరాశ్రయుల్ని చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు పస్తం ఆనంద్, ఇప్ప ప్రసాద్, జాడి రామయ్య పాల్గొన్నారు.