Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
సీపీఎస్, ఎన్ఈపీ 2020 నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రచారాన్ని చేపట్టారు. ఎస్టీఎఫ్ఐ జాతీయ సంఘం పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ట్రెజరీ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నుండి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.శ్రీనివాస్, వి.అశోక్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం పేరుతో కొత్తగా తీసుకోవాల్సిన సీపీఎస్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని అన్నారు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ పీఎఫ్, ఆర్డీఏ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతోందన్నారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ-2022) పేదలను చదువుకు దూరం చేస్తుందన్నారు. కార్పొరేట్ రంగంలో 100 విదేశీ యూనివర్సిటీలను మన దేశంలోకి అనుమతిస్తున్నారని ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలకు గ్రాంటులను కుదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో రెగ్యూలర్ ఉపాధ్యాయులను నియమించకుండా వాలంటీర్లతో బోధన చేపట్టేలా కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఉమ్మడి జాబితాలోని విద్యను కేంద్ర ప్రభుత్వం తన వద్ద కేంద్రీకృతమైనట్లు వ్యవహరిస్తుందన్నారు. విద్యారంగంలో జ్యోతిష్య శాస్త్రాలను ప్రవేశపెడుతూ ఆశాస్త్రీయ అంశలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎంఈపీ 2020), సీపీఎస్ రద్దుకు 50 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వివరించారు. దానిలో భాగంగానే జిల్లా నుండి 5వేల ఉద్యోగుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం అందించనున్నామని తెలిపారు.