Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్
నవతెలంగాణ-కాగజ్‌నగర్
మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2 వేల వేతనాన్ని వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ జిల్లా రెండో మహాసభలు పట్టణంలోని రిటైర్డ్ భవనంలో నిర్వహించారు. ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం అసెంబ్లీలో రెండు వేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రకటించి, రెండు సంవత్సరాలైనా అమలు కావడం లేదన్నారు. గుడ్ల బిల్లులు రావడం లేదని, మెస్‌చార్జీలు విడుదల చేసిన కార్మికులకు ఇప్పటివరకు అకౌంట్లలో జమ కాలేదని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులు కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో అప్పులు తెచ్చి వంట చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెరిగిన కోడి గుడ్ల ధర ఇవ్వడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2001వ సంవత్సరం నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన సేవలందిస్తున్న కార్మికులు రాష్ట్రంలో 54 వేల 200 మంది ఉన్నారని అన్నారు. వీరికి ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఓదేలు, జిల్లా నాయకులు నగేష్, కృష్ణమాచారి, ఎర్ర కాంత, శారద, వసంత, పూల బాయి, రూప, ఆత్రం కమలాబాయి, లక్ష్మి పాల్గొన్నారు.