Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతంత మాత్రంగానే ఓపీ సేవలు
- ఐపీ సేవల ఊసే లేదు
- ప్రహరీ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ భవన నిర్మాణాల మీద లేదాయే..
- స్థానికేతరులకే ఉద్యోగ అవకాశాలు
నవతెలంగాణ-బీబీనగర్
బీబీనగర్ రంగాపురంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వైద్య కళాశాలకే పరిమితమైంది. 2019 ఆగస్టు 19న అప్పటి భూపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ శర్మన్‌సింగ్ 50 మంది వైద్య విద్యార్థులతో ఎయిమ్స్ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 1028 కోట్ల నిధులను కేటాయించింది. 45 నెలల్లో ఎయిమ్స్ ను పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని, 750 పడకలతో ఐపీ సేవలు విస్తరించాలని లక్ష్యం నిర్దేశించింది. ప్రస్తుతం 19 నెలలు పూర్తయినా నిమ్స్ ఆసుపత్రి కోసం నిర్మించిన భవనాలు తప్ప కొత్తవి నిర్మించలేదు. శంకుస్థాపనలకు కూడా నోచుకోలేదు. 2020 మార్చి నెలలో ఓపీ సేవలు ప్రారంభించాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో ఆలస్యంగా నవంబర్ 5న ఓపీ సేవలను ప్రారంభించారు. జనరల్ మెడిసన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్, పీడీయాట్రిక్లలో మాత్రమే ఓపీ సేవలు అందిస్తున్నారు. ఐపీ సేవలు ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదు. భవన నిర్మాణాలు పూర్తయితేనే ఐపీ సేవలకు అవకాశం ఉంటుంది. భవన నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఎయిమ్స్‌లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తే స్థానికేతరులకు అవకాశాలు కల్పిస్తున్నారనే విమర్శలున్నాయి.
అంతంత మాత్రంగానే ఓపీ సేవలు
ప్రస్తుత ఎయిమ్స్‌లో అంతంత మాత్రంగానే ఓపీ(ఔట్ పేషెంట్) సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండువేల మంది ఓపీ సేవల కోసం వస్తారని అధికారులు భావించినా ప్రస్తుతం అరకొర వసతులు, వైద్య సేవలతో 500 మందిని మించి రావడం లేదు. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేరు. మౌలిక సదుపాయాలు లేవు. ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తే నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందుతుందని భావించారు. కానీ నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. ఇక ఐపీ(ఇన్ పేషెంట్) సేవలు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి గతంలో ఎయిమ్స్ పర్యటన సందర్భంగా త్వరలోనే 750 పడకలతో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ అతీ గతీ లేదు.
భవన నిర్మాణాలు చేపట్టలేదు
బీబీనగర్ ఎయిమ్స్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. పూర్తిస్థాయిలో వసతి గహాలు, క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, మెడికల్ కళాశాల, ఆయుష్ బిల్డింగ్, ఆడిటోరియం, స్టాఫ్ రెసిడెన్షియల్ భవనాలు, బందావనాల నిర్మాణానికి కేటాయించారు. కానీ నిర్మాణ పనుల్లో అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎయిమ్స్ చుట్టూ ప్రహరీ నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఎయిమ్స్ భవనాల నిర్మాణంపై లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మూడు సంవత్సరాల్లో ఎయిమ్స్ భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పడున్న పరిస్థితులు చూస్తుంటే ఇంకో ఐదు సంవత్సరాలు దాటినా పూర్తయ్యేలా కనిపించడం లేదు.
నిధులు ఉన్నా నిర్మాణాల్లో జాప్యం
ఎయిమ్స్ భవన నిర్మాణాల కోసం నిధులు ఉన్నా పనులు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో బీబీనగర్ ఎయిమ్స్ ను తీర్చిదిద్దుతామన్న డైరెక్టర్ ఆ దిశగా పనులు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. స్థల సేకరణ పూర్తయి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా నిర్మాణాలు చేపట్టడం లేదు.
స్థానికులకు మొండి చెయ్యి
బీబీనగర్ రంగాపురంలో ఎయిమ్స్ వస్తే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిరుద్యోగ యువత ఆశించింది. కానీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో స్థానికేతరులను ఎంపిక చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మా ప్రాంతంలో ఎయిమ్స్ నిర్మిస్తూ మాకు కాకుండా బయటి వ్యక్తులకు ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎయిమ్స్ ప్రారంభంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
రెండు బ్యాచ్‌లలో వంద మంది విద్యార్థులు మాత్రమే
ఎయిమ్స్ వైద్య కళాశాలను బ్యాచ్‌కు 100 మంది చొప్పున విద్యార్థులతో ప్రారంభిస్తామని చెప్పినా ప్రస్తుతం కేవలం 50 మందితో మాత్రమే బ్యాచ్‌ను ఏర్పాటుచేశారు. 2019 ఆగస్టు 18న మొదటి బ్యాచ్ 50 మందితో, 2020 జూన్, జులైలో రెండో బ్యాచ్ 50 మందితో కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల లేమితోనే కేవలం 50 మందితో బ్యాచ్‌ను ఏర్పాటుచేసినట్టు సమాచారం.