Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔట్సోర్సింగ్ కార్మికుల నుండి డబ్బులు తీసుకున్న అల్పా ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విభాగంలో కొత్తగా నియమించిన 40మంది కార్మికుల నుండి ఆల్ఫా ఏజెన్సీ సంస్థ డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీల కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బుధవారం మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. .ఔట్సోర్సింగ్ కార్మికుల నుండి ఏజెన్సీ సంస్థ డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు.మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నూతన సిబ్బంది నియామకం చేసే ఆల్ఫా ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ కార్మికుల నుండి తీసుకున్న నగదును తిరిగి ఇవ్వాలని కోరారు. ఇదే కాకుండా నలుగురిని చైర్మన్ వ్యక్తిగత పనులు చేయడం కోసం నియమించుకున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ లో తిరిగే సమయంలో కేవలం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కోసం ఓ వ్యక్తిని నియమించుకున్నట్టు పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం మున్సిపల్ సిబ్బంది నియామకంలో భాగంగా వ్యక్తులను నియమించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మున్సిపల్ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొయ్యడ సైదులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగరాజు, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, పోలోజు శ్రీధర్ బాబు, దండ హిమబిందు ,బొడిగె అరుణ బాలకష్ణ, అంతటి విజయలక్ష్మీ బాలరాజు, ఉబ్బు వరమ్మ వెంకటయ్య,కాంశెట్టి శైలజ భాస్కర్,సందగళ్ల విజయసతీష్,తదితరులు పాల్గొన్నారు.