Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నువ్వా..నేనా అంటూ ప్రచారం
- ఒకరిపై ఒకరు విమర్శలు..
- మండలానికో ఎమ్మెల్యేను నియమించిన టీఆర్ఎస్
- ప్రచార క్షేత్రంలోకి ఒంటి చేత్తో జానా
- బీజేపీ తరపున 30 మంది ప్రచారకులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అధికార పార్టీ సీరియస్‌గా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమిం చారు. అంతే కాకుండా ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమిం చారు. వీరితో పాటు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్ధక శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నెల రోజులుగా ఆయా మండలాలకు సంబంధించిన ఇన్చార్జిలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కులాల వారిగా బలాలు, బలహీనతలు తెలుసుకుని వారందర్నీ తమ పార్టీవైపు మళ్లించేందుకుందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. ప్రచారం కోసం ఉపయోగించే వాహనాల ను కూడా ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున ఉండేలా నిర్ణయించారు.
సింగిల్ హ్యాండ్‌తో జానా
సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి ఒంటిచేత్తోనే వెళ్తానని నామినేషన్ల కంటే ముందే జానారెడ్డి ప్రకటించారు. అయితే తనకు నాయకుల బలగం లేక అలా అన్నారను కుంటే పొరపాటే.. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా వివిధ గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఎవరొచ్చి ఎక్కడ చేడగొడతారోనని ఆందోళనతో ఆయన చెప్పినట్టుంది. అయితే ఇప్పటికే హాలియా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. బహుశా భవిష్యత్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం కాంగ్రెస్‌లో లేకపోవచ్చు. అందుకే తన కుమారులు, నియోజకవర్గంలో ఉన్న సీనియర్, జూనియర్ నాయకులను కలుపుకుని ప్రచారం చేస్తానని ప్రకటించారు. 35 ఏండ్లుగా నియోజకవర్గంలో తాను చేసిన పనులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతానని ఆయన చెపుతున్నారు. అంతేగాకుండా తాను భవిష్యత్‌లో ఎన్నికలలో పోటీ చేయనని, ఆరోగ్యం కూడా సహకరించడంలేదన్నారు. ఈసారి మాత్రం ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరుతున్నట్టు తెలిసింది.
బీజేపీ తరపున 30 మంది ప్రచారకులు
నాగార్జున సాగర్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలో ఉంది బీజేపీ. నాగార్జున సాగర్‌లో మెజార్టీ ఓటర్లు గిరిజనులు కావడం, జనరల్ సీటులో ఎస్టీ అభ్యర్థిని బరిలోకి దించామనే పేరు కోసం ప్రయత్నం చేసింది. అంతేగాకుండా ఈ సీటు గెలవాలంటే కార్యకర్తలు, ప్రజలను ఉత్తేజ పరిచే నాయకులు, సీనియర్ నాయకులను ఎన్నికల ప్రచారకులుగా నియమించింది. దాదాపు 30 మందిని ఎంపిక చేయగా అందులో పార్టీ అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్‌రావు తదితరులను నియమించారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటారు.
మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) ఉప ఎన్నికలు అనివార్యమైనప్పటి నుంచి ఇక్కడే తిష్టవేసింది.గత నాలుగు నెలలుగా నియోజకవర్గంలో తన అనుబంధ సంఘాలలో గ్రామాల్లో పనిచేస్తుంది. ఆ పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేసిన ద్రోహం గురించి వివరిస్తూ తమ అభ్యర్థి ఆడేపు నాగార్జునకు ఓటేయాలని కోరుతున్నారు.
టీడీపీ నుంచి మువ్వా అరుణ్‌కుమార్ పోటీలో ఉన్నాడు. గతంలో ఆ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ఓట్లు అడిగేందుకు సిద్దమయ్యారు. మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నా వారి ప్రభావం ఇక్కడ నామమాత్రంగానే ఉంటుంది.