Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి
- మిల్లర్లు పూర్తిగా సహకరించాలి
- అదనపు కలెక్టర్ మోహన్ రావు
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ప్రభుత్వ సూచనలకునుగుణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు అదనపు కలెక్టర్ మోహన్‌రావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పీడీ కిరణ్‌కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ ద్వారా 188, పీఏసీఎస్ ద్వారా 134, అదే విధంగా ఏఎంసీ ద్వారా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యతా అలాగే తేమ 17 శాతం మించకుండా పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వం గ్రేడ్ ఏ రకానికి రూ.1888 అలాగే సాధారణ రకం రూ.1868 ధర నిర్ణయించిందన్నారు. రైతులు దళారుల మాటలు నమ్మి ఇబ్బందులు పడొద్దని కోరారు. జిల్లాలో రబీ ధాన్యం 5,01,550 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని సూచించారు. అన్ని కేంద్రాల్లోనూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లాలో లక్షా 56 వేల గన్నీ బ్యాగులు అవసరమున్నాయని, ప్రస్తుతం 46 వేల బస్తాలు నిల్వ ఉన్నాయని, మిగిలిన బ్యాగులు త్వరలో తెప్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీవో శ్రీనివాసులు, తునికల అధికారి వెంకటేశ్వర్లు, డీఏవో రామారావునాయక్, డీఎం పుల్లయ్య, మార్కెటింగ్ ఏడీ సంతోష్, డీటీ రాజశేఖర్, మిల్లర్ల అధ్యక్షులు రవీందర్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.