Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : వైద్యులు
- పలుచని నూలు వస్త్రాలు శ్రేయస్కరం
నవతెలంగాణ -రామన్నపేట
ఎండాకాలం ప్రారంభమైంది .భానుడి భగభగలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, వేసవి తాపానికి మండల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటిందంటే చాలు సూర్యుడు ఆకాశంలో మండిపోతున్నాడు. ఇంత ఉష్ణోగ్రతలు నమోదు కావడం 8 దశాబ్దాలలో ఎన్నడూ చూడలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించడం విశేషం. సాయంత్రం నాలుగు గంటల వరకు ఉష్ణోగ్రత తీవ్రత తగ్గడం లేదు. సుమారు 40 డిగ్రీలకు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోతోంది. వేసవి తాపం తీవ్రంగా ఉండడంతో ఇంట్లో ఉడకపోత, బయట ఎండ తీవ్రత కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండలో వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు తగిన ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు. మూడు రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. వడగాల్పులు వీస్తున్నాయి.నాలుగైదు రోజులుగా గాలుల వేగం సాధారణం కంటే తగ్గిపోవడం ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్య క్రాంతి నేరుగా ఎక్కువగా భూమికి చేరడం వంటి కారణాలవల్ల ఈ తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.
చల్లదనం కోసం పరుగులు
ఉష్ణోగ్రతలు క్రమేణా పెరిగిపోతుండడంతో ప్రజలు చల్లదనం కోసం కూలర్లను, ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం మూల కేసిన కూలర్లను తిరిగి బాగా చేసుకుని వాడుకలో పెట్టారు. మరికొంత మంది పేదలు తమ ఇంటి కిటికీలకు, దర్వాజాలకు గోన సంచులను వేలాడదీసి తరచూ చల్లని నీటితో తడుపుతూ ఉన్నారు.
జాగ్రత్తలు పాటించాలి : వైద్యులు
చాలా మటుకు ఎండలో వెళ్లకుండా నీడ పట్టునే ఉండాలి. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే తలకు టోపి, తెల్లని నూలు బట్టలను వేసుకొని బయటికి వెళ్లాలి. ముక్కు, చెవులు, తలకు ఎండ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. తరచూ మంచినీరు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని వెంట ఉంచుకోవాలి. అలసటగా ఉన్నా నీరసంగా ఉన్నా వడ దెబ్బ తగిలినట్టుగా ఉన్నా వెంటనే చల్లని నీడకు చేరుకుని సేద తీరాలి. ఓఆర్ఎస్ ద్రావణం సేవించాలి. తడి బట్టతో శరీరాన్ని, ముఖాన్ని తుడుచుకోవాలి.