Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడతలో గొర్రెలు ఇవ్వకండి..!!
- రాజపేట అధికారులకు ఎమ్మెల్యే హుకూం
- నిలదీసిన గొర్రెలకాపరికి అందిన ఫలితం
- రైతు వేదిక ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ సునీత మహేందర్రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో ఇంకా గొర్రెలు ఇవ్వడానికి నిలదీసినందుకు గొర్రెలకాపరిపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత విరుచుకుపడ్డారు. అధికారుల ద్వారా ఆ వ్యక్తి ఊరు, పేరు తెలుకొని ఇతనికి రెండో విడతలో గొర్రెలను ఇవ్వకండని వేదికపై నుండే ఆఫీసర్లను ఆదేశించారు. రూ. 47వేలు అప్పుచేసి డబ్బులు చెల్లించి చాలా యేండ్లు అవుతుంది..మాకు గొర్రెలు ఇంకా రాలేదు అని ఆకాపరి అనడంతో ఎమ్మెల్యే గరం గరమయ్యారు. 'ఏందీ నువ్వడిగేదని కాపరిపై కట్టలు తెంచిన కోపంతో విప్ ఊగిపోయారు. ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండల కేంద్రంలో రైతు వేదిక శుక్రవారం విప్ సునీత ప్రారంభించారు. ఈ వేడుకలో పాల్గొన్న కాకళ్ల అయిలయ్య రైతు వేదిక సభలో స్థానిక ఎమ్మెల్యేను మాకు ఇంకా గొర్రెలు ఇవ్వరాని నిలదీశాడు. ఊహించని ఈ పరిణామానికి ఎమ్మెల్యేతో సహ పార్టీ కార్యకర్తలు బిత్తరపోయి నోరెళ్లబెట్టారు. ఆ వ్యక్తిని సముదాయించేందుకు గులాబీలు రంగంలోకి దిగాయి. అయినా శాంతించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించడం కష్టతరంగా ఉందని సదరు గోడు వెల్లబోసుకున్న కాపరికి రానున్న రెండో విడతల్లో గొర్రెలను మంజూరు చేయకూడదని వేదికపైన ఆఫీసర్లకు ఎమ్మెల్యే ఆదేశిచడంతో నియోజకవర్గంలో విమర్శలపాలైంది. గోడు వెళ్లబోసుకున్న కాపరిని పోలీసులు సభ నుండి నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపారు. నిలదీసిన పాపానికి గొర్రెలకాపరికి అందిన ఫలితంగా పలువురు అభివర్ణించారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే టీిఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును ఇలా నొక్కివేయడమేంటని పలువురు వాపోయారు.