Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటీఎంల వద్ద తచ్చాడుతూ వివరాల సేకరణ
- క్షణాల్లో మాయం చేస్తున్న వైనం
నవతెలంగాణ-మిర్యాలగూడ
మీ ఖాతాలో నగదు ఉందా.. వాటిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటున్నారా...బ్యాంకులోనే ఉన్నాయి కదా..ఎటు పోతాయని భరోసాతో ఉన్నారా....? అలాంటి భరోసాకు కాలం చెల్లింది.ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త.. ! మీ నగదును మీకు తెలియకుండానే మాయం చేసే నేరగాళ్లు తయారయ్యారు.వాళ్లే సైబర్ నేరగాళ్లు. ఏమి తెలియనట్టు అమాయకంగా నటిస్తూ అక్కడక్కడ ఏటీఎం, బ్యాంకుల దగ్గర తచ్చాడుతూ మీకు సహాయం చేయాలనే తాపత్రయ పడుతూ కనిపిస్తుంటారు.వాళ్లకు నమ్మి ఏటీఎం కార్డు, బ్యాంకు బుక్, ఏటీఎం సీక్రెట్ నెంబర్ ఇచ్చారనుకోండి ఇక మీ బ్యాంకులో నగదు మాయమైనట్టే. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకోవడంతో పాటు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తరుచుగా జరుగుతున్నాయి.ఈ విషయం తెలిసిన తర్వాత అమాయకులైన ఖాతాదారులు మాయమైన నగదు నిల్వ తెలుసుకొని లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు పరిసర ప్రాంతాల్లోనే రెండు, మూడు చోటుచేసుకోవడం సైబర్ నేరగాళ్ల నేరాలకు అద్దం పడుతున్నాయి.సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దష్టి సారించినప్పటికీ నేరగాళ్లు ఖాతాదారులతో ఉన్నచనువుతో నగదును మాయం చేస్తుండటంతో సైబర్ నేరాలు అదుపు చేయడం సమస్యగా మారుతోంది.
మిర్యాలగూడ మండలం జంకుతండాకు చెందిన ఎఫ్‌సీఐ డీపీఎస్ కార్మికుడు మాలోతు మంగ్య నగదును గత నెల 26వ తేదీన రూ.40,023లను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.25వ తేదీన తన అవసరం నిమిత్తం ఏటీఎంకు వెళ్లి రూ.500 డ్రా చేసిన సదరు కార్మికుడు మళ్లీ 27వ తేదీ బ్యాంక్‌కు వెళ్ళినప్పుడు చూసుకోగా రూ.40,023 మాయమైనట్టు తెలుసుకున్నాడు.ఈ విషయమై బ్యాంకులో సంప్రదించగా బీహార్ రాష్ట్రంలోని గజియాబాద్ ఏటీఎం నుండి నగదు రూ.10 వేల చొప్పున నాలుగు విడతలుగా ఒకే రోజున రూ.40,023 డ్రా అయినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.అదేవిధంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్ ఇటీవల రిటైర్ అవ్వగా అతని ఖాతా నుండి కూడా రూ.60 వేలు సైబర్ నేరగాళ్లు డ్రా చేసుకున్నారని గుర్తించినట్లు సమాచారం.అదే విధంగా ఇటీవల కాలంలో వేములపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు ఖాతా నుండి కూడా రూ.లక్ష డ్రా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా నేరగాళ్లు మాత్రం తమతతంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు నిత్యం తమ విధుల్లో తీరికలేకుండా ఉంటుండగా ఇలాంటి ఘటనల పై దష్టి సారిద్దామంటే సరైన ఆధారాలు లేకపోవడం సవాల్‌గా మారుతున్నాయి.దీంతో ఇంట్లో నగదు ఉంచితే దొంగల భయం కాగా బ్యాంకు ఖాతాలో నగదు ఉంచితే సైబర్ నేరగాళ్ల ఆగడాలతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు ప్రత్యేక దష్టి సారించి సైబర్ నేరగాళ్ల ఆగడాలను అరికట్టాలని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో సైబర్‌నేరాలకు పాల్పడితే ఇలాంటి చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసే చర్యలు పోలీసులు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.