Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేయడంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నాంపల్లి మండలంలో అవినీతి ఆరోపణలు కప్పుపుచ్చుకోవడానికి ఉన్నతాధికారులు పంచాయతీ ఏఈని అక్కడి నుంచి బదిలీ చేశారని దీని ద్వారా ప్రజాప్రతినిధులు చేసిన పనులు పెండింగ్లో ఎన్నాయని, ఆ అధికారిని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని నాంపల్లి జెడ్పీటీసీ అధికారులను నిలదీశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. విద్యా వ్యవస్థ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య కార్మికులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని దీని ద్వారా పాఠశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారుర. కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో జిల్లాలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. నిధులు మంజూరు కాకపోతే ఎస్టిమేషన్తో తన దగ్గరికి వస్తే సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 మంది ఎమ్మెల్సీలు కలిసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి వినతి అందజేశామని, రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రూ.500 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : జెడ్పీ చైర్మెన్
జిల్లాలోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా ప్రతినిధులను కలుపుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ పెద్దులు, జెడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి, వివిధ మండలాల జెడ్పీటీసీలు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్మెన్, పలువురు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కోవిడ్ టీకా వేసుకున్నారు.