Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను వారికే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలపరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆరెకరాల ప్రభుత్వ స్థల్లాన్ని ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించి ఆ స్థలంలో పార్టీ జెండాను పాతేందుకు యత్నించారు.ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది.మద్దిరాల ఎస్సై సాయిప్రశాంత్ ,నూతనకల్ ఎస్సై దస్తగిరి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.ఆ భూమిని పేదలకు ఇవ్వాలని కోరారు.1995లో బడుగు,బలహీన వర్గాలకు గాను 18 ఎకరాల భూమిని గత ప్రభుత్వం కొనుగోలు చేసి పట్టాలను సైతం ఇచ్చిందన్నారు.ఆ భూమిలో నాడు ఎటువంటి నీటి,విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఇండ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మిషన్ భగీరథ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పల్లెప్రకతి వనం నిర్మాణం చేపట్టాలని, అవి పోను మిగిలిన ఆరెకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించిన వారికి నిరుపేదలైన అర్హులకు ఇవ్వాలని కోరారు.ఇంటి స్థలం లేని వారికి రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి అంజపల్లి లక్ష్మయ్య, పార్టీ మండల నాయకులు బొజ్జ శ్రీను,బత్తుల శ్రీను,తొట్ల లింగయ్య, గ్రామ శాఖ కార్యదర్శులు సంజీవ, బత్తుల సోమయ్య, ఆనంతుల రాఘవులు, బొజ్జ మల్లయ్య, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు బత్తుల సందీప్, కుసు బాలకష్ణ, బొజ్జ విజరు,విజరురెడ్డి, ఉప్పుల రమేశ్, గుణగంటిలింగయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.