Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదురుతున్న ఎండలు
- అడుగంటుతున్న భూగర్భ జలాలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రోజురోజుకు ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి కోత, పొట్ట దశకు వచ్చిన వరి చేలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. 31 గ్రామ పంచాయతీలు ఉన్న మండలంలో ప్రతి ఏటా రబీ సీజన్లో మూడు వేల ఎకరాలకు మించి వరి పంటను సాగు చేసే వారు కాదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విస్తారమైన వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండి అలుగులు పోశాయి. భూగర్భజలాలు పెరుగడంతో రైతులు ఏండ్ల తరబడిగా పాడావుబడిన బోరుబావులను మరమ్మతులు చేయించి వరి పంట సాగు చేసేందుకు మొగ్గు చూపారు. 12 వేల ఎకరాలకు పైగా మండలంలో వరి సాగు చేశారు. దీనికితోడు ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు ఇవ్వడంతో అవసరానికి మించి భూగర్భ జలాలను బోరు బావుల ద్వారా రైతులు వినియోగించారు. దీనికితోడు రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. పొట్ట, కోత దశకు వచ్చిన వరి చేలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే మండలంలోని నారాయణపురం, చిమిర్యాల, కొత్తగూడెం, రాచకొండ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయినట్లు వ్యవసాయ అధికారులు ధవీకరించారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అందజేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆరుతడి పద్ధతుల్లో వరి సాగు చేయాలి :మండల వ్యవసాయ అధికారిణి ఉమారాణి
వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయాలి. పాత పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల వరికి ఇరవై నాలుగు వందల గ్యాలరీల నీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు వథా అయి పోతున్నాయి. దీనికితోడు ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 400 ఫీట్లకంటే తక్కువ లోతులో ఉన్న బోరు బావులు ఎండిపోతున్నాయి. బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయి.