Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్లో మండలాల ఇన్చార్జిల తీరుపై స్థానిక టీఆర్ఎస్ నేతల గుర్రు
- స్థానిక అధికార పార్టీ నేతలపై అధిష్టానం నిఘా
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రతి మండలానికో ఇన్చార్జిని నియమించింది. అంతే కాదు..మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరూ అక్కడే వాలిపోయారు. గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు పెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా..స్థానికంగా మేం ఉన్నా..ఇన్చార్జిల పెత్తనం ఏంటని ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. పని మాది..పెత్తనం వారిదా..ఎన్నికల తర్వాత రాజకీయాలు చేసేదీ మేము.. పది రోజుల పండుగ కోసం తీర్థయాత్రలకు వచ్చినట్టు వచ్చిపోయే వాళ్లు తమపై పెత్తనం చెలాయించడం ఏంటని గుర్రుగా ఉన్నారు. ఈ గుర్రు..అలకలు, వ్యతిరేకత ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతాయో చూడాలి మరి.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ ఇతర జిల్లాలకు చెందిన నేతలను ఇక్కడ ఇన్చార్జిలుగా నియమించింది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఇన్చార్జిలకు అధినేత ఆదేశాలు చేసింది. దీంతో గ్రామాల్లో సాగే ప్రచారం, ఖర్చులు, తిండి, డబ్బుల పంపిణీ వరకూ పూర్తి స్థాయిలో ఇన్చార్జిలే చూసుకుంటున్నారు. నిన్నటి వరకూ పార్టీ కోసం పనిచేసిన వారిని ఎవరూ అడిగే పరిస్థితి లేదు.
స్థానిక నాయకత్వంపై నిఘా...
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం కోసం మండల ఇన్చార్జిలు పనిచేస్తున్నా స్థానిక టీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టినట్లు సమాచారం. నువ్వా నేనా అనే పద్ధతిలో సాగుతున్న ప్రచార హోరులో ఎప్పుడు.. ఎవరు ఎక్కడుంటారో తెలియని అయోమయ పరిస్థితులలో క్షేత్రస్థాయి నాయకులపై ఓ కన్నేసి పెట్టినట్టు సమాచారం. నిత్యం ప్రచారంలో ఉంటున్నప్పటికీ ప్రతిపక్షాల ప్రలోభాలకు ఎవరైనా గురవుతున్నారా.. పార్టీలోనే ఉండి మోసం చేసేందుకు ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానంతో ప్రతి నాయకుడి కదలికలనూ గమనిస్తున్నట్టు సమాచారం. ఇన్చార్జిలుగా ఉన్న వారి వెంట వచ్చిన అనుచరగణం కూడ స్థానిక నాయకత్వంపై ఆజామాయిషీ చేస్తున్నారని, అంతా తామే అంటూ వారు వ్యవహరిస్తున్న తీరు కూడా గ్రామాల్లోని నాయకత్వానికి ఏ మాత్రం మింగుడు పడడంలేదని తెలుస్తుంది. ఈ విషయాలను గమనిస్తున్న స్థానిక నాయకత్వం ఇంతకాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తమపై అనుమానం వ్యక్తం చేస్తే ఎలా పనిచేస్తామని, నమ్మకం లేనప్పుడు ఎందుకు పార్టీ కోసం ప్రచారం చేయాలని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఓ పది రోజులు ఉండి పోయే వాళ్లకు ఇచ్చే గౌరవం తమకు లేకపోవడం పట్ల వారంతా ఆవేదనకు లోనవుతున్నట్టు తెలిసింది.