Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 ఏండ్లుగా సాగుతున్న బునాదిగాని కాల్వ పనులు
- అసంపూర్తిగా కాల్వల నిర్మాణం
- భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించని ప్రభుత్వం
- ఎన్నికల హామీగా వాడుకుంటున్న పాలకులు
- బస్వాపురానికి లింక్ చేయాలని డిమాండ్
- సాగునీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులు
- కాల్వ సాధనకు సీపీఐ(ఎం) పోరుబాట
నవతెలంగాణ-మోత్కూర్
వథాగా పోతున్న మూసీ జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు, చిన్న నీటి వనరులకు మళ్లించి సాగునీరు అందించి బీడు భూములను సస్యశామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన బునాదిగాని(ధర్మారం) కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ కాల్వ పనులు అక్కడక్కడ తవ్వి వదిలేయడంతో ఆ కాల్వ కూడా పూడిపోతున్నది. బీబీనగర్, భువనగిరి, వలిగొండ, మోటకొండూర్, ఆత్మకూర్ (ఎం), మోత్కూర్ ,అడ్డగూడూర్ మండలాల్లోని సుమారు 20 వేల బీడు భూములకు సాగు నీరు అందించేందుకు బునాదిగాని కాల్వకు రామన్నపేటలో 2005 ఏప్రిల్ 10న అప్పటి సీఎం వై ఎస్.రాజశేఖర్ రెడ్డి, 2006 ఏప్రిల్ 24న మోత్కూర్ మండలం ధర్మారం చెరువు వద్దఅప్పటి రామన్నపేట ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, మంత్రి విజయరామరాజు శంకుస్థాపన చేశారు. బీబీనగర్ మండలం మక్తాఅనంతారంనుంచి మోత్కూరు మండలం ధర్మారం వరకు బునాదిగాని కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ14.53 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాగా కాల్వ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టగా బీబీనగర్ మండలం మక్తా అనంతారం నుంచి ముగుదుంపల్లి కత్వ వరకు(28 కిలోమీటర్లు) మొదటి దశకు రూ.3 కోట్లు, అక్కడి నుంచి వలిగొండ మండలం పాహిల్వాన్ పురం వరకు(20 కిలోమీటర్లు) రెండో దశకు రూ.2.23 కోట్లు, పాహిల్వాన్ పురం నుంచి మోత్కూర్ మండలం ధర్మారం చెరువు వరకు చేపట్టిన మూడో దశకు(43 కిలోమీటర్లు) 'ధర్మారం' కాల్వగా అధికారులు నామకరణం చేశారు. దీని నిర్మాణం కోసం రూ.9.30 కోట్లు కేటాయించారు. మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల్లోని 23 గ్రామాల్లో 25 చెరువులను నింపడంతో పాటు 11,844 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కాల్వ పనులు 2009లో పూర్తి కావాల్సి ఉన్నా కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపంతో కాల్వ పనులు అస్తవ్యస్తంగా, అసంపూర్తిగా ఉన్నాయి.
పరిహారం కోసం పనులను అడ్డుకుంటున్న రైతులు
కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వక పోవడంతో రైతులు పనులను అడ్డుకుంటున్నారు. అప్పట్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, సాగునీరు వస్తుందన్న ఆశతో రైతులు పరిహారం విషయంలో డిమాండ్ చేయలేదు. అప్పటి ప్రతి పాదనల ప్రకారం కొంత మంది రైతులకు పరిహారం చెల్లించగా, నిధుల కొరత కారణంగా మిగతా రైతులకు చెల్లించలేదు. 2010లో మళ్లీ భూసేకరణకు సర్వే చేయడంతో భూముల ధరలు పెరగడంతో పరిహారం అమాంతం పెరిగిపోయింది. దీంతో మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేయడంతో మోత్కూరు మున్సిపల్ పరిధిలోని కొండగడప వరకు వచ్చి కాల్వ పనులు ఆగిపోయాయి. దీంతో అప్పటి జాయింట్ కలెక్టర్ నీతు ప్రసాద్, భువనగిరి ఆర్డీవో ముత్యంరెడ్డి కాలువ పనులను పరిశీలించి పనకబండ, ఆరెగూడెం బుజిలాపురం గ్రామాల్లో పలువురు రైతులకు ఎకరాకు రూ.5.20 లక్షల చొప్పున పరిహారం అందించారు. మిగతా వారు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంకు అంగీకరించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
సాగునీరు అందే గ్రామాలివే...
బీబీనగర్, భువనగిరి, వలిగొండ, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల్లో 89.60 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తయితే 541 చెరు వులు, 49 గ్రామాల రైతులకు సాగునీరు అందనుంది. నేరుగా లబ్దికూరే గ్రామాలు బ్రహ్మణపల్లి, ఎర్రబేటితండా, మగ్దుంపల్లి, నవాత్ పల్లి, తుక్కాపురం, ఎర్రంబల్లి, ఎడ్లమోటబావి, తుర్కపల్లి, అనాజిపురం, నందనం, పహిల్వాన్‌పురం, బునాదిగానిచెరువు, టేకుల సోమారం, ఎదుళ్లగూడెం, రెడ్లరేపాక, జుట్నిబావితండా, లింగరాజుపల్లి, పులిగిళ్ల, కాటెపల్లి, సర్వేపల్లి, నాంచారిపేట, రాయిపల్లి, కొండాపురం, తుక్కాపురం, రహీంఖాన్‌పేట, కూరెళ్ల, పుల్లాయిగూడెం, పనకబండ, రాజన్నగూడెం, ఆరెగూడెం, మోత్కూరు, బుజిలాపురం, కొండగడప, పాటిమట్ల, దాచారం, డి.రేపాక, అడ్డగూడూరు, ధర్మారం గ్రామాలు ఉన్నాయి.
కాల్వ పునరుద్ధరణ పనులకు మోక్షం కలిగేనా..?
బునాదిగాని కాల్వ పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులకు సీఎం కేసీఆర్ రూ.85.60 కోట్లు ప్రకటించడంతో కాల్వ పనులకు మోక్షం లభించేనా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 55.35 క్యూసెక్కుల కెపాసిటీ తో 2.50 మీటర్ల వెడల్పు, మీటర్ లోతుతో ప్రారంభించిన కాల్వతో చివరి వరకు నీరు రాదని గుర్తించి 300 క్యూసెక్కుల కెపాసిటీ, 13 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతుతో కాల్వ పునరుద్ధరణకు, రైతులకు పరిహారం కోసం 2017 మేలో చౌటుప్పల్ వచ్చిన సీఎం కేసీఆర్ రూ.85.60 కోట్లు ప్రకటించారు. మోత్కూర్ మండలం పనకబండ వద్ద 2017 నవంబర్ 5న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మోటకొండూర్ మండలం నాంచారిపేట వద్ద ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కాల్వ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. కాల్వ పునరుద్ధరణ పనులు ప్రారంభించి కొన్ని రోజులు చేసినా బండరాళ్లు వచ్చిన చోట, అక్కడక్కడ అసంపూర్తిగా వదిలేశారు. కల్వర్టులు నిర్మించలేదు. ప్రస్తుతం ఈ కాల్వ హైదరాబాద్ సీఈ కంట్రోల్ లో ఉంది. కాల్వ పర్యవేక్షణకు అధికారి కూడా ఎవరు లేరు. బునాదిగాని కాల్వ పై ఇటీవలే హైదరాబాద్ లో అధికారులతో సమావేశం జరిగిందని, త్వరలోనే అధికారిని నియమిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు కాల్వను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
కాల్వ సాధనకు పోరుబాట పట్టిన సీపీఐ(ఎం)
జిల్లాలో ప్రధానంగా బునాదిగాని కాల్వ సాధనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరుబాట పట్టింది. జిల్లాలో చిన్న నీటి వనరులను బలోపేతం చేసి రైతులకు సాగునీరు అందించాలని, బునాదిగాని కాల్వను బస్వాపురం రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలికాలంలో మూసీ జలాలు ఫ్యాక్టరీల రసాయనాలతో తీవ్రంగా కలుషితం కావడంతో ఆ నీటితో పంటలకు, భూములకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్వాపురంకు బునాదిగాని కాల్వను అనుసంధానం చేసి గోదావరి జలాలు అందించాలని రైతులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
బొల్లు యాదగిరి, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు, మోత్కూర్
బునాదిగానే కాల్వ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలి. భూనిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఈ సీజన్లోనే కాల్వను పూర్తి చేయడం తో పాటు బస్వాపురానికి అనుసంధానం చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలి.