Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బృందం సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ-మోత్కూర్
ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళన చెందుతోందని, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర మండలంలోని పాలడుగు గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల్లు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలను ప్రభుత్వం లాక్కోకుండా ఆ స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేరని, ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందడం లేదన్నారు. బీబీనగర్ నిమ్స్ పూర్తి కాలేదన్నారు. సీఎం కేసీఆర్ ది ప్రచార ఆర్భాటమే తప్ప అభివద్ధి చేయడం లేదన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మోత్కూర్, అడ్డగూడూర్ ప్రాంతాలకు సాగునీరు అందించే బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.