Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ మండలానికి చేరుకున్న సీపీఐ(ఎం) జన చైతన్య పాదయాత్రకు ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మద్దతు తెలిపారు. మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చేరుకున్న పాదయాత్ర బందం సభ్యులను ఆయన పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి జహంగీర్ బందం నెలరోజులు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను, అభివద్ధిని, పాలనను గాలికి వదిలేశారని, జిల్లాల్లో అభివద్ధి మేడిపండులా ఉందని విమర్శించారు. ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా అవి సంపూర్ణంగా పేదలకు అందడం లేదని, కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో రియల్ వ్యాపారం జోరుగా నడుస్తోందని, భవిష్యత్తులో పంట భూములన్నీ ప్లాట్లుగా మారి రైతులు, కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం భవిష్యత్ పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవాలని అన్నారు. నడి వేసవిలో ఆరోగ్యాలను లెక్కచేయకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం గొప్ప విషయమని, పాదయాత్రకు సూర్యాపేట జిల్లా కమిటీ మద్దతు ఇస్తుందని, ముగింపు రోజున బహిరంగ సభకు జిల్లా నుంచి తరలి వచ్చి పాల్గొంటామని తెలిపారు.