Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ వ్యవసాయ నల్ల చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదు
- కేసీిఆర్, మోడీ దొందూ దొందే
- బునాదిగానికాల్వను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
- మోత్కూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఏర్పాటు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-మోత్కూర్
రైతుల వ్యతిరేకతతోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని ప్రకటించారని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, జన చైతన్య పాదయాత్ర సారధి ఎండి. జహాంగీర్ అన్నారు. సాగునీటి కాల్వల సాధన, జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య పాదయాత్ర బుధవారం ఉదయం మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర పాలడుగు మీదుగా దత్తప్పగూడెం, ముషిపట్ల, శివనగర్, ఆరెగూడెం నుంచి రాత్రి మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సీజన్లో ధాన్యం దిగుబడి బాగా వచ్చిందని, రైతుల నుంచి వ్యతిరేకతను గుర్తించి కేసీఆర్ సాగర్ ఎన్నికల్లో దెబ్బతింటామని రైతుల ఓట్ల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. రైతులు కోతలు మొదలు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తెచ్చిపోస్తున్నా ఇప్పటికీ కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. తమది ఇది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా తెచ్చిన నల్ల చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధరలను కూడా చట్టంలో పెట్టలేదన్నారు. మున్ముందు రైతులు మద్దతు ధరకు పంటలను అమ్ముకునే పరిస్థితులు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఏడేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 52 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మోడీతో లాలూచీ పడ్డారన్నారు. కేసీఆర్ , మోడీ దొందూదొందే అని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడటం ఖాయమని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సరైన యంత్రాంగం, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని, హుస్సేన్‌సాగర్ ప్రాజెక్టు మరమ్మతుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గ్రామాలభివద్ధికి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే నేటికీ కొనసాగుతున్నాయన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, జిల్లాలో లక్షా 10 వేల మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో కనీసం రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రజలు పాదయాత్రలో మా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు 16 వేలకు పైగా వినతి పత్రాలు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో భగీరథ పనులు పూర్తి చేయకపోవడంతో తాగునీరు అందడం లేదని, వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మోత్కూర్ ప్రాంతానికి సాగునీరు అందించే బునాదిగాని కాల్వ పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. పునరుద్ధరణ పనులకు కేటాయించిన నిధులను వెంటనే మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన కాల్వ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాల్వలో భూమి కోల్పోయిన రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని, కాల్వను బసవపురం రిజర్వాయర్ తో అనుసంధానం చేసి గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేశారు. మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సివిల్ ఆస్పత్రిగా మార్చాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మోత్కూర్ మున్సిపాలిటీలో అభివద్ధి పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలో ఉపాధి హామీ పనులను పునరుద్ధరించాలని అన్నారు.
పాదయాత్రకు ప్రజల ఘన స్వాగతం
సాగునీటి కాల్వల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాల నుంచి ఘనస్వాగతం లభించింది. పాదయాత్ర పాలడుగు గ్రామానికి చేరుకోగానే ప్రజలు, పార్టీ నాయకులు కోలాట బందాలతో స్వాగతం పలికారు. సీపీఐ(ఎం)జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, సీపీిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, పట్టణ కార్యదర్శి పుల్కరం మల్లేశం, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, బహుజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర నాయకుడు కొంపెల్లి రాజు తదితరులు బందం సభ్యులకు స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. పాలడుగు, దత్తప్పగూడెం, ముశిపట్ల, మోత్కూర్ లలో పార్టీ జెండాలు ఎగుర వేశారు. వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు పాదయాత్ర బందం సభ్యులకు వినతి పత్రాలు అందజేశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వారి దష్టికి తీసుకు వచ్చారు. సీపీఐ(ఎం)మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు అధ్యక్షతన నిర్వహించిన ఆయా సభల్లో పాదయాత్ర బందం సభ్యులు బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, కొండమడుగు నరసింహ, మాటూరి బాలరాజు, ధరావత్ రమేష్ నాయక్, గ్రామ శాఖల కార్యదర్శులు పిట్టల చంద్రయ్య, మామిడి కష్ణ, పైళ్ల రాంరెడ్డి, మండల నాయకులు కొంపెల్లి ముత్తమ్మ, దడిపెళ్లి ప్రభాకర్, బుగ్గ రాములు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్, బొడ్డుపల్లి వెంకటేష్, వనం రాజు, సిర్పంగి స్వామి, శ్రీకాంత్, శివ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.