Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పాదయాత్ర బృందం..
- జన చైతన్య రథ సారధి జహంగీర్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల సమస్యల పరిష్కారానికి జనచైతన్యమే ఆయుధమని భావించి 18రోజులుగా సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య పాదయాత్రకు ఊరు.. వాడ... జనం జేజేలు పలుకుతూ .. నీరాజనాలు పడుతున్నారు.మండే ఎండల్లో తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నడక మొదలుపెట్టిన బృందానికి మొదటిరోజు నుండీ ఇప్పటివరకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది.దానికి ప్రధాన కారణం ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారి తరపున మాట్లాడే గొంతులు కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనన్న భావన ప్రజల్లో ఉంది.అందుకోసం ఎక్కడికి వెళ్లినా గుండెతలుపులు తట్టి...సాదరంగా గ్రామాల్లోకి పాదయాత్ర బృందాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్నారు.వారి ప్రేమ ముందు బృందం సభ్యులు ఆరోగ్యం, కాళ్లు బొబ్బలెక్కినా.. కాళ్లు నొప్పులు పెట్టినా బలాదూర్‌గా కనిపిస్తున్నాయి. ప్రజలకున్న సమస్యలను మీ ద్వారానే పరిష్కరించాలని కోరుతూ గ్రామాలలో ప్రజలు యాత్ర టీం సభ్యులు వినతి పత్రాలుఅందజేస్తున్నారు.దీంతో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కనీస అవసరాలు తీర్చాలని, రెండు పడకల ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలని, మూడెకరాలు పంపిణీ ముందుకు ఎందుకు సాగడంలేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.దీంతో ప్రభుత్వ పాలన యంత్రాంగంలో కదలిక మొదలైనట్టు తెలుస్తుంది. ఇదే విషయమై పాదయాత్ర టీం లీడర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌తో మాటాముచ్చట...
రేషన్ కార్డులపై కదిలిన యంత్రాంగం
టీిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల నుండి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు.యాదాద్రి జిల్లాలో ప్రభుత్వానికి 1.10లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు.ఎవరిదైనా పెండ్లి జరిగిన, చనిపోయిన వెంటనే రేషన్‌కార్డులో వారి పేర్లు తొలగిస్తున్నారు.కానీ కొత్తవాళ్లను చేర్చే క్రమంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.పాదయాత్ర బృందానికి 28వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మూడు రోజుల కింద మండలతహసీల్దార్ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయాల నుండి మండల స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి.ఈ మేరకు అర్హులైన లబ్దిదారులు దరఖాస్తులు చేసుకునే పనిలో ఉన్నారు.
పెన్షన్‌కు అర్హులైన వారి వివరాల సేకరణ..
జిల్లాలో 86వేల మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం 57ఏండ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికలలో వాగ్దానం చేసింది.అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కరికి కూడ పెన్షన్ ఇవ్వలేదు. కానీ పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చింది.దాని ఫలితంగానే జిల్లాలో ఎంతమంది పెన్షన్‌కు అర్హులైన లబ్దిదారులు ఉన్నారో పూర్తి వివరాలు సేకరించాలనే ఆదేశాలు ఇప్పటికే మండల స్థాయి అధికారులకు అందాయి. అదే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది.
20రోజుల్లో పిట్టలగూడెం సందర్శిస్తానని కలెక్టర్ హామీ...
ఆత్మకూర్ మండలం పిట్టలగూడెం గ్రామం పూర్తిగా గిరిజన గ్రామం.ఇక్కడ పక్కా ఇండ్లే లేవు.మురికి కాల్వలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం లేదు.రేషన్ షాపు లేదు.రేషన్ సరుకుల కోసం చాడ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది.ఇప్పటికి కూడా బహిరంగ మలమూత్రం, స్నానాలు చేస్తున్నారు.గ్రామాన్ని సందర్శించిన సందర్బంగా ఇదే విషయాన్ని కలెక్టర్‌కు బృందం ద్వారా తీసుకెళ్లాం. 20రోజుల్లో గ్రామాన్ని సందర్శించి సమస్యలకు పరిష్కారం చూపిస్తా అంటూ హామీ ఇచ్చింది.
ఎయిమ్స్‌లో అంతర్గత సేవలు..
ఎయిమ్స్‌లో బయటి పెషేంట్లకు మాత్రమే వైద్యం అందిస్తున్నారు.అంతర్గత సేవలు అందించాలని యాత్ర సందర్భంగా అధికారులను డిమాండ్ చేశాం.అతి త్వరలో మొదలు పెడతామని హామీ ఇచ్చారు.వరదకు కొట్టుకుపోయిన గోకారం - జాలుకాల్వ మద్య కల్వర్టును నిర్మించాలని డిమాండ్ చేసిన రెండు రోజుల్లోనే ప్రజాప్రతినిధులు పనులు మొదలుపెట్టారు. పాదయాత్ర పూర్తయ్యేలోపు రెండు పడకల గదుల ఇండ్లు పంపిణీ చేయాలని లేకపోతే తామే ప్రజలకు పంపిణీ చేస్తాం.