Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదునైన విమర్శలతో అధికార ప్రతిపక్ష పార్టీలు
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ మాత్రమే ప్రచారంలో ముందుండగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. వారం రోజులుగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గం కలియ తిరుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కోలాటాలు, డీజే సౌండ్స్, ప్రచార రథాలు, కార్యకర్తల నినాదాలతో నాగార్జున సాగర్ నియోజక వర్గం మొత్తం దద్దరిల్లుతోంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మొదటి నుంచీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. నియోజకవర్గంలోని సాగర్, నిడమనూర్ మండలంలో శుక్రవారం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి పల్లా రాజేశ్వ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, అభ్యర్థి నోముల భగత్‌కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెద్దవూర మండలంలో హోంమంత్రి మహమూద్ అలీ, మండల ఇన్చార్జి బాల్క సుమన్ వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. 40 ఏండ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదని విమర్శిస్తున్నారు.
దూకుడు పెంచిన జానా
40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుందూరు జానారెడ్డి ఈసారి గెలుపు అత్యంత అవసరంగా మారింది. ఇక్కడి గెలుపుతో రాష్ట్ర పార్టీకి జీవం పోసినట్లుగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బయటపడుతుంది. అందుకే జానా విజయం కోసం రాష్ట్ర స్థాయి నేతలు ఒక్కొక్కరుగా నియోజక వర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలోని పెద్దగూడెం, చిన్నగూడెం, ఈదులగూడెం, ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి నాగా ర్జునసాగర్ కేంద్రంలో రెండు రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకున్న కుటుంబాన్నిపరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలోని పెద్దవూర పర్యటన సందర్భంగా తుమమ్మచెట్టు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. పులిచర్ల, ఉట్లపల్లి, పర్వేదుల గ్రామాలలో పర్యటించి, జానారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు.
ప్రచారంలోకి దిగిన ప్రధాన బీజేపీ నేతలు
రెండు రోజుల నుంచి బీజేపీకి చెందిన ప్రధాన నేతలు ప్రచార రంగంలోకి దిగారు. శాసనసభ పక్ష ఉపనేత రఘనందన్‌రావు నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో రంగుండ్ల, శ్రీరాంపల్లి, ఆల్వాల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అనుముల మండలం చల్మాపూర్, కొట్టాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి త్రిపురారం మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి రవినాయక్ నాయినవాని కుంటతండా, జయరాంతండా, కోమటికుంట తండా, పాల్తీ తండా, బసోని బావి తండాలో ప్రచారం నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం సాగుతుంది. మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఆడేపు నాగార్జున తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్‌గౌడ్, నాయకులు జానకి రామయ్య చౌదరి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ పాలించిన పార్టీలు పూర్తిగా ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.