Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన చైతన్య యాత్ర సారధి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ-గుండాల
గుండాల మండలానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా జనగామ జిల్లాలో కొనసాగుతున్నాయని, వెంటనే వాటిని యాదాద్రి జిల్లాలో కలపాలని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారధి ఎమ్‌డి.జహంగీర్ డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర శనివారం గుండాల మండలం వస్తాకొండూరు, నూనెగూడెం, గుండాల,గంగాపురం,మరిపడిగ గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సభల్లో జహంగీర్ మాట్లాడుతూ గుండాలలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ బాలుర వసతిగృహం ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా మార్చి 24 గంటల పాటూ వైద్యం అందించాలని కోరారు. అసంపూర్తిగా వదిలివేసిన సాగునీటి కాలువలను పూర్తి చేసి బిక్కేరు వాగులో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం నిర్మించాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన ప్రభుత్వాలు ప్రజలపై భారల మీద భారాలు వేస్తున్నాయన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. పాదయాత్రకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.వి.రమణ, జనగామ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి కనకారెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు హరిచంద్ర, జన చైతన్య పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు.పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధరావత్ రమేష్, కల్లు గీత కార్మిక సంఘం జనగామ, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల కార్యదర్శులు బాల్నే వెంకటమల్లయ్య, ఉషబోయిన వెంకటనర్సయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, మండల కార్యదర్శి మద్దెపురం రాజు, సీఐటీయూ కార్యదర్శి పోతరబోయిన సత్యనారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ పింగిలి విజరురెడ్డి, ఎమ్‌డి.వజీర్, సురేష్, వీరస్వామి, శంకర్, బాలయ్య, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.