Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం కొండ కింద నిర్మించతల పెట్టిన దుకాణ సముదాయాలను కొండపైన నిర్మించాలని శ్రీ లక్ష్మీ నరసింహ వర్తక వెల్ఫేర్ సంఘం కోరింది. శనివారం యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘం సభ్యుల సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత నేతృత్వంలో సీఎం కేసీఆర్ను కలిసి సమస్యను వివరించనన్నట్టు తెలిపారు. టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా ఆరేండ్ల నుంచి 110 దుకాణాలకు స్థలం లేనందున 30,20,10 దుకాణాలు వేర్వేరు కాలాల్లో కొంత కాలం నడిచాయని, ఈ దుకాణాలకు కూడా సొంత ఖర్చులతో వ్యాపారులే షెడ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఇలా వైటీడీఏ నిర్ణయాలకు అనుగుణంగా నాలుగుసార్లు కూలగొట్టారని తెలిపారు. ఈ కాలంలో 110 దుకాణాలకు గాను ఎలాంటి బకాయిలూ లేకుండా రూ.16 లక్షల కిరాయి చెల్లించామన్నారు. ఈ క్రమంలో కొండపైన కొత్త షాపులు నిర్మించి ఇస్తారనే ఆశతో ఇక్కడి వ్యాపారులు ఉన్నారని తెలిపారు. వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబాలు వీధిన పడనున్నా యన్నారు. స్పందించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే చొరవతో కొండపైన దుకాణాలు నిర్మించడానికి సీఎంను కోరుదామని వర్తకులకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు కొన్ని రమేష్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి తడక వెంకటేష్, సంఘ సభ్యులు జి.దామోదర్, గుజ్జ శ్రీను, బందారపు బిక్షపతి, కలకుంట్ల శేఖర్, పి రామకృష్ణ, శిలివేరు కిషోర్, ఆరె శ్రీధర్, చంద్రగిరి శ్రీను, ఇమ్మడి శ్రీను, బి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.