Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండూరు
న్యూ మాంక్స్ కుంగ్‌ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ, ట్రస్మా నల్లగొండ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యాసంస్థల ఆర్ధిక సహకారంతో ఉపాధ్యా యులు, సిబ్బందికి రూ.రెండు లక్షల విలువ చేసే బియ్యం, నిత్యావసర సరుకులను శనివారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థల ప్రాంగణంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.యన్.రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల మంది ప్రయివేటు టీచర్లు, సిబ్బంది కరోనాతో ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 13 నెలలుగా పాఠశాలలు నడవక, వేతనాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యం మానవతా దృక్పధంతో రూ.2 లక్షలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యానాల ప్రభాకర్‌రెడ్డి, న్యూ మాంక్స్ కుంగ్‌ఫూ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు ఎమ్‌డి.అజీజ్ పాష, జిల్లా నాయకులు జి.వి.రావ్, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ రామయ్య, వెంకట్రావ్, సురేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.