Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డంపింగ్ యార్డుకు స్థలం కరువు
- చెత్తా చెదారంతో నిండిన చెరువు
- మత్స్య సంపదకు ముప్పు
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు.. అనే సూక్తితో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019లో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, విద్యా, వైద్యం మెరుగు పర్చాలని నిర్ణయించారు. పథకం లక్ష్యం ఘనంగా ఉన్నా నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీలో పాలక వర్గానికి చిత్తశుద్ధి కరువై, మండల స్థాయి, వివిధ శాఖల అధికారుల సమన్వయ లోపంతో ప్రభుత్వ పథకాలు అమలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పోతున్నాయి.
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను ట్రాక్టర్ల ద్వారా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి ఆ చెత్తను 6 విభాగాల్లో వేరు చేసి ఆదాయ వనరుగా మార్చుకోవాలని అనుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2 లక్షలా 50 వేలు మంజూరు చేసింది. డంపింగ్ యార్డ్ నిర్మాణంతో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పర్యావరణాన్ని కాపాడంతో పాటు గ్రామ పంచాయతీకి ఆదాయ వనరుగా మార్చుకునే విధంగా కంపోస్టు ఎరువులను తయారుచేసుకునే విధానాన్ని సైతం ఈ పల్లె ప్రగతిలో చేర్చారు. కానీ 2019 నుంచి నేటి వరకు ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని గుర్తించడం, డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం చేయలేదు. 2019 ముందు 481 సర్వే నెంబర్లో 10 గుంటల స్థలంలో నార్కట్‌పల్లిలో సేకరించిన చెత్తను డంప్ చేసేవారు. ఆ స్థలం కాస్త పట్టా భూమి అని తేలడంతో యజమాని రాజేంద్ర ప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు గ్రామంలో 2 ట్రాక్టర్ల ద్వారా సేకరిస్తున్న సుమారు మూడు టన్నుల చెత్తను నార్కట్‌పల్లి పెద్దచెరువు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్నారు.
చెతాక్త చెదారంతో చెరువు ఫుల్
కాకతీయ కాలంనాటి గొలుసుకట్టు చెరువుల్లో నిర్మాణంలో భాగంగా నార్కట్‌పల్లి పెద్ద చెరువు 480 ఎకరాల్లో నిర్మించారు. నిజాం కాలం నాటి ఈ చెరువు ద్వారా సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఈ చెరువు విస్తీర్ణం చాలా విశాలంగా ఉండటంతో ఈ చెరువులో నీళ్లు ఉంటే చెరువు చుట్టు పక్కల 20 కిలో మీటర్ల వరకు భూగర్భ జలాలు నిలువ ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలాంటి చెరువు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాల్వతో పాటు బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా చెరువు నింపాలని ఆలోచనతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలుమార్లు చెరువును సందర్శించి మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. చెరువులో ఉన్న కంప ను తొలగించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ.80 లక్షలు ఖర్చు చేసి చెరువును అభివృద్ధి చేసే పనిని చేపట్టింది. ఇదిలా ఉంటే నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో రోజువారీగా ఇంటి దగ్గర నుంచి సేకరించిన చెత్తను, రోడ్డు వెంబడి ఉన్న వ్యాపార సముదాయాలు వేసిన చెత్త, పట్టణంలోని వైద్యశాలలు, ఇతర ప్రాంతాల నుంచి వధాగా ఉన్న సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, జంతువుల కళేబరాలు, చికెన్ సెంటర్ లో నుంచి సేకరించిన చెత్తను సైతం చెరువు వద్ద పడేస్తున్నారు.
మత్స్య సంపదకు ముప్పు
నార్కట్‌పల్లి పెద్ద చెరువులో గత సంవత్సరం భారీగా కురిసిన వర్షాలకు నీరు వచ్చి చేరింది. దీంతో మత్స్యకారులకు లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నార్కట్‌పల్లి పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. కానీ చెత్తా చెదారం, ప్లాస్టిక్, ఇతర విష పదార్థాలు మొత్తం కూడా చెరువులోకి డంపు చేయడంతో నీటిలో కలిసి మత్స్య సంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ప్రమాదం ఉందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.