Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దెకు తెచ్చిన గొర్రెలు లబ్దిదారులకు అందజేత..?
ప్రభుత్వం గొర్రె కాపరులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గొర్రెల పంపిణీ పథకాన్ని మొదలు పెట్టింది. ఈ పథకంతో లబ్దిదారుల కంటే బ్రోకర్లు, వారికి మద్దతుగా ఉంటున్న రాజకీయ నాయకులు, అధికారులకే మేలు ఎక్కువ జరుగుతోంది. కుడిచేత్తో ఇస్తూ.. ఎడమ చేత్తో తిరిగి అక్కడి నుంచి గొర్రెలను తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న గొర్రెలు లబ్దిదారులకు పంపిణీ చేయక ముందే చనిపోతున్నాయి.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలో 43 మంది లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తున్నారు. యూనిట్ విలువ రూ.1.25 వేలు ధర నిర్ణయించారు. అందులో లబ్దిదారుడి వాట రూ.32వేలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న డీడీలు సంబంధించిన లబ్దిదారులకు అందజేశారు. ఇందులోనూ అధికారులకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే అందజేసినట్టు తెలిసింది. వరుస క్రమంలో డీడీలు చెల్లించి వారికి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వచ్చిన కొద్దిన గంటల్లోనే చనిపోతున్న గొర్రెలు..
కాగితాలల్లో పని జరిగినట్టుగా ఉంటే చాలు.. లబ్దిదారులకు ఏ మాత్రం మేలు జరుగుతుందన్న విషయం తమకు అవసరం లేదన్న పద్ధతిలో పశువైద్యాధికారులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదే క్రమంలో శనివారం పీఏపల్లి మండల కేంద్రంలో గొర్రెలు పంపిణీ చేయడానికి ఆంధ్ర నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిలో రెండు గొర్రెలు వచ్చిన కొద్ది గంటల్లోనే చనిపోయా యి. మరికొన్ని గొర్రెలు కూడా ఆనారోగ్యం పాలైనట్టు సమాచారం. ఎందుకు ఇలా జరిగిందంటే అధికారులు కూడా తేలికగా తీసేస్తున్నారు.
అద్దెకు తెచ్చిన గొర్రెలు పంపిణీ...?
లబ్దిదారులకు ఆంధ్ర నుంచి కొనుగోలు చేసిన గొర్రెలు పంపణీ చేస్తుంటారు. అందులో భాగంగానే అక్కడ కొనుగోలు చేసిన గొర్రెలు కాకుండా ఓ రైతు నుంచి అద్దెకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆంధ్రకు సంబంధించిన బ్రోకర్ 43 యూనిట్లకు సంబంధించిన గొర్రెలు రెండు మూడు రోజులు ఇక్కడ ఉంచి లబ్దిదారులకు పంపిణీ చేసినట్టుగా రికార్డుల్లో నమోదైన తర్వాత వాటిని తర్వాత తిరిగి ఆంధ్రకు తీసుకొచ్చేలా అక్కడి ఓ రైతు వద్ద అద్దెకు మాట్లాడి తీసుకువచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఆ గొర్రెలకు ఏదైనా ప్రమాదం జరిగితే బ్రోకర్ బాధ్యత వహించేలా నిర్ణయించు కున్నారు. ఇందులో స్థానిక పశువైద్యాధికారి, స్థానికంగా ఉండే బ్రోకర్ల హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
గొర్రెలు తీసుకెళ్లే సమయంలో లబ్దిదారులకు సొమ్ము చెల్లించేలా ఒప్పించారు. ఒక్కొక్కరికి రూ.70వేలు అందజేస్తున్నట్టు సమాచారం. మొదట ఒప్పందం జరిగిన తర్వాతనే గొర్రెలు ఇక్కడికి తీసుకొచ్చినట్టు సమాచారం. కొంతమంది గొర్రెలను ఎంపిక చేసుకోవడానికి నాలుగైదు రోజులు ఆంధ్రకు వెళ్లారు. స్వయంగా పేరు చెప్పడానికి ఇష్టపడని లబ్దిదారుడే ఈ విషయాన్ని స్పష్టంగా చెపుతున్నాడు. బ్రోకర్ల కోసం గొర్లు అందిస్తున్నారే తప్ప తమకు మేలు చేయాలని డాక్టర్లకు లేదు.. బ్రోకర్లు, పశువుల డాక్టర్లు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు.
గొర్రెలు చనిపోయిన సమాచారం లేదు
సుబ్బారావు, జిల్లా పశువైద్య శాఖ అధికారి, నల్లగొండ
పంపిణి చేసిన మాట వాస్తవమే. కానీ గొర్రెలు చనిపోయిన విషయం నా దృష్టికి రాలేదు. అయినా చనిపోతే లబ్దిదారులకు ఇన్సురెన్సూ వస్తుంది. వారికి ఎలాంటి నష్టమూ ఉండదు.