Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
పంటల్లో సోకే కీటకాలు, తెగుళ్ల నివారణకు వాడుతున్న విషపూరిత మందులకు ప్రత్యామ్నయంగా జీవనియంత్రణ పద్ధతులు, జీవశిలీంద్రాలు, జీవన ఎరువులవాడకంపై పురుగు మందుల డీలర్లకు అవగాహన కల్పించామని కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో సర్టిఫికెట్ కోర్సు పొందుతున్న పురుగుమందుల డీలర్లకు జీవనియంత్రణ పద్ధతులపై ఒక్కరోజు శిక్షణనిచ్చారు.చీడపురుగుల వల్ల దాదాపు 25 శాతం పంట దిగుబడి తగ్గుతుందని, పురుగుల నివారణకు కేవలం రసాయనిక మందులనే వాడడం వల్ల చీడపురుగులను తినే పరాన్నజీవులకు హాని కల్గి వాతావరణంలో సహజ శత్రువులు లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సమయాల్లో పురుగుల సంఖ్య అధికమవడం జరుగుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా జీవ సమతుల్యం, ప్రకతి సమతుల్యం కాపాడుకోవడానికి జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం అవసరమన్నారు.ఈ శిక్షణలో పరాన్నజీవులు ట్రైకో గ్రామా, టెలికోమస్ పరాన్న భుక్కులు(బదనికలు), క్రైపోపా, సాలీడు, అక్షింతల పురుగు, గొల్లభామలు, పక్షి స్థావరాలు పురుగులకు రోగాన్ని కలగజేసే సూక్ష్మజీవులు బాక్టీరియాకు చెందిన బాసిల్లన్ తురింజెన్సిన్(బి.టి) శిలీంధ్రాలు, ఎన్‌పివి వైరస్ తయారీ వాడకంపై వివరించారు.పలు పంటలకు ఆశించే వేరుకుళ్లు, దుంపకుళ్లు, ఎండు రోగాలు, కాయకుళ్లు రోగాల నివారణకు వాడే ట్రైకోడర్మా విరిడి, హర్జియానం, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే బాక్టీరియాలు, జీవన ఎరువులు, అజోల్లా తయారీ, రసం పీల్చే పురుగుల నివారణకు వాడే వర్టిసీలియం లెకాని, బవేరియా, నులిపురుగుల నివారణకు వాడే పెసిలోమైసిస్ లిలియేసి, మైకో రైజాలు నూతన ఆవిష్కరణలైన హ్యూమిక్ ఆసిడ్, సముద్రపు నాచు, అమినో ఆసిడ్, పల్విక్ ఆసిడ్ ద్రావణాలు, గుళికల వల్ల కలిగే లాభాల గురించి వివరించినట్లు కోర్సు కోఆర్డినేటర్ డి.నరేష్ తెలిపారు.ఈ శిక్షణలో డీలర్లు ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వీరస్వామి, నగేష్, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, కందిబండ శ్రీను, హనుమంతరావులతో పాటు, 40 మంది పాల్గొన్నారు.