Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన నేతలంతా ఇక్కడే మకాం...
- డబ్బు, మద్యం అక్రమ నిల్వలపై కేసులు నమోదు..
- కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలు తమకున్న సర్వశక్తులను ఓడ్డుతున్నారు. చావో రేవో అనే పద్ధతిలో పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా అధికార టీిఆర్‌ఎస్, కాంగ్రెెస్ పార్టీలు నువ్వా... నేనా అన్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా నాగార్జున సాగర్‌లో తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తుంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
టీిఆర్‌ఎస్ ప్రచారంలో జిల్లా మంత్రితో పాటుగా మరో నలుగురు మంత్రులు, ఎమ్యెల్యేలు, పార్టీ నాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తిగా చుట్టేసి వచ్చారు. 40ఏళ్లలో జానారెడ్డి చేసింది శూన్యమని, తాము అధికారంలోకి వచ్చాకే సాగర్ అభివృద్ధి చెందిందని మంత్రులుఎమ్యెల్యేలు పదే పదే చెపుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన నిర్లక్ష్యం కారణంగానే జిల్లా ప్రజలకు నష్టం జరిగిందని, 14శాఖలకు మంత్రిగా చేసినప్పటికి ఎందుకు ఫ్లోరిన్ సమస్యను పరిష్కరించలేదనే పదునైన విమర్శలు చేస్తున్నారు. 75ఏండ్ల వయసులో కూడా రాజకీయాలు అవసరమా.. జానాకు మిగిలిందే గతమేనని, రాజకీయ భవిష్యత్ ఇక లేదని వారు విమర్శిస్తున్నారు. అంతేగాకుండా చిరకాలంగా రాజకీయాలలో ఉన్న జానాకు ప్రస్తుతం రాజకీయాలలో, టీిఆర్‌ఎస్ లో నాయకులంతా శిష్యగణమే అయినందున ఎవరెక్కడ కోవర్టులుగా మారుతారోననే భయం వెంటాడుతుంది.
ప్రధాన నేతలంతా ఇక్కడే....
కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచిన తర్వాత ప్రధాన నేతలంతా ఇక్కడే తిష్టవేసి గ్రామ గ్రామాన ప్రజలను కలిసి టీిఆర్‌ఎస్ చేసిన మోసాలను వివరిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ఆలీ, సీతక్క తదితర నేతలంతా గతంలో జానారెడ్డి ఇక మిగిలింది నాలుగు రోజులే..చేసిన అభివృద్దిని చూసి ఓటేయ్యాలని విన్నవిస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడ వేయలేదన్న సంగతి గుర్తుంచుకోవాలని పెర్కొంటున్నారు. గిరిజనులకు పంచాయితీలు చేశారు సరే.. అభివృద్దికి ఎన్ని నిధులిచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఈ సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకవిధానాలు అవలంబిస్తున్న అధికార పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలన్నారు.
సాగర్ కోసం ప్రత్యేక మ్యానిఫె˜స్టో..
కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలు కూడ ఇక్కడ ఎన్నికై అభివృద్ది చేయలేదని, తమ ద్వారానే అభివృధ్ది సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సాగర్ అభివృద్ది కోసం ప్రత్యేక మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆయనతోపాటుగా నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్ చుగ్, డికె అరుణ, ఎమ్మేల్యే రఘనందన్‌రావు, బాబుమోహన్, మురళీధర్‌రావు,, నల్లు ఇంద్రసేనా రెడ్డిలు పాల్గొంటున్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలు గమనించాలని పిలుపునిస్తున్నారు. గిరిజన అభ్యర్థిని ప్రకటించినందును ఆ సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టిసారించినప్పటికి ఇతర సామాజిక వర్గాలను అకట్టుకునే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇక్కడ గెలిస్తే భవిష్యత్‌లో తెలంగాణాలో అధికారంలోకి రావడం ఖాయమనే ఆశ ఆ పార్టీలో ఉంది. దానికోసం తమ శక్తులను ఉపయోగిస్తున్నారు.
రూ.46.79లక్షలు సీజ్..
నాగార్జున సాగర్ నగర్ నియోజకవర్గం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.46,79,200 నగదును జిల్లా పోలీసులు సీజ్ చేశారు. ఇందులో హాలియా సర్కిల్ పరిధిలో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా రూ.24.89లక్షలు, పెద్దవూర పోలీస్ స్టేషన్ పరిదిలో రూ.2.50లక్షలు, కొండమల్లేపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.4.81లక్షలు, త్రిపురారం స్టేషన్ పరిధిలో రూ.3.54లక్షలు పట్టుబడడంతో అధికారులు సీజ్ చేశారు.
రూ.35.11లక్షల మద్యం సీజ్..
ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ కోసం అక్రమంగా నిల్వచేయడంతో అధికారులు పట్టుబడ్డారు. రూ. 35.11లక్షల విలువ కలిగిన 4012.82లీటర్ల మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబందించి 45కేసులు నమోదయ్యాయి. వీటితోపాటుగా 35బెల్టుషాపులు సీజ్ చేయగా హాలియా 5, నిడమనూర్ 4, త్రిపురారం 3, తిరుమలగిరి సాగర్ 1, గుర్రంపోడు 6, మధులపల్లి 8బెల్టుషాపులను సీజ్ చేశారు.
కోవిడ్ నిబందనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు.
ఎన్నికల ప్రచారం సందర్బంగా కోవిడ్ నిబంధనలు కూడ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయినా వాటిని పాటించిన పార్టీలు, వ్యక్తులుపై పోలీసుశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో దాదాపు 68కేసులు నమోదు చేశారు. వాటిలో కాంగ్రెస్ పార్టీపై 21, టిఆర్ఎస్ 24, బీజేపీ 20 కేసులు నమోదు కాగా ఇతరులపై మూడు కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు.