Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- మోత్కురు మండలంలో తడిచిన 20 వేల బస్తాల ధాన్యం
- రామన్నపేట, అర్వపల్లిలో తడిచిన ధాన్యం
- ఇప్పటికీ పలు చోట్ల ఏర్పాటు చేయని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- అందుబాటులో లేని టార్ఫాలిన్లు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలయ్యింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసి రైతులను నిండా ముంచింది. ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని రైతులు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి నిల్వ చేశారు. ఈ క్రమంలో వచ్చిన అకాల వర్షంతో పంటంతా నీటి పాలయ్యింది. యాదాద్రి జిల్లా మోత్కూరు, రామన్నపేటతో పాటు పలు మండలాల్లో వర్షం కురిసింది. మోత్కూరులో 20 వేల బస్తాల ధాన్యం తడిచింది. రామన్నపేటలోనూ ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోనూ వర్షం కురిసింది. ఇక్కడా కొన్ని చోట్ల ధాన్యం తడిచి పోయింది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పండించిన పంట అమ్ముకోవడానికి వచ్చి మార్కెట్లో ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో రైతులు తమ పంట వర్షానికి ఎక్కడ కొట్టుకుపోతుందోననే భయం గుప్పిట్లో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మోత్కుర్ మండలంలోని దాచారం గ్రామంలో తాటి చెట్టుటపై పిడుగు పడి తాటిచెట్టు పూర్తిగా కాలిపోయింది. పాలడుగు గ్రామంలో ధాన్యం తడిచింది. నల్లగొండ జిల్లాలో కనగల్ మండలం రేగట్టేలో వడగండ్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మండలంలో వర్షం పడింది.
అందుబాటులోని ఉంచని టార్పాలిన్లు
ఏ మార్కెట్ కేంద్రంలో కూడా రైతులకు అవసరమయ్యే టార్ఫాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో అద్దెకు తెచ్చిన టార్పాలిన్లుతో రైతులు ధాన్యం తడవకుండా చేసే ప్రయత్నం చేసుకుంటున్నారు. వర్షం వస్తుందని తెలిసి కూడ రైతులకు టార్ఫాలిన్లు అందజేయలేదు. చిట్యాల మండల కేంద్రంలో ఒక్కటి కూడా ఇవ్వక పోవడంతో రైతులు వర్షం వస్తే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. మోత్కూర్ మండంలో ఏ గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారభించకపోవడంతో కొనుగోలు మొదలు కాలేదు. టార్ఫాలిన్లు కూడా సరఫరా చేయకపోవడం వల్ల ధాన్యం సుమారు 20వేల బస్తాల వరకు తడిచినట్లు తెలుస్తుంది. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాలో రైతులకు సరిపోయే విధంగా ఎక్కడ కూడ టార్పాలిన్లు సరఫరా చేయలేదు.