Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకోసం ఉద్యమించాలి
- ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
- నల్లగొండలో కదం తొక్కిన కేవీపీిఎస్ నీలిదండు సైన్యం
నవతెలంగాణ- నల్లగొండ
రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం జ్యోతిరావుపూలే, అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని ఉద్యమించాలని, మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ భవనం నుంచి ప్రకాశం బజార్ , డీఈఓ ఆఫీసు వరకు కేవీపీఎస్ కార్యకర్తలు నీలిరంగు షర్టులు, ధరించి ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పై ప్రమాణం చేసిన బీజేపీ నేతలు తమ మతోన్మాద కాషాయ ఎజెండాను అమలు చేయడం కోసం రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. పూలే, అంబేద్కర్ ఆశయాలను సమాధి చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందన్నారు. ప్రధాని ఒక వ్యాపార వేత్తగా మారి రిజర్వేషన్లకు ఎసరు పెడుతున్నదన్నారు.రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని తమ మతోన్మాద కుయుక్తులు పన్నుతోందన్నారు. బీజేపీ పాలనలో దళితులు, మహిళలపై హింస పెరిగిందన్నారు. ఆవుపేరుతో దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ ఉపేక్షిస్తుందన్నారు. సబ్ ప్లాన్ నిధులు దళిత సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా అన్యాయం చేస్తుందన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కేవీపీఎస్ కషి చేస్తుందన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మతోన్మాద శక్తులు చాపకింద నీరులా అట్టడుగు పేదలను అణిచి వేయటానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. దేశ సమైక్యత మతసామరస్యం కోసం అందరూ ఐక్యం కావాలని అన్నారు. పూలే అంబేద్కర్ స్పూర్తితో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏప్రిల్30న జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు రేముడాల పర్శరాములు, పనికర కష్ణమోహిని, జిల్లా ఉపాధ్యక్షులు గాదె నర్సింహ, జిట్టానగేష్, గండమల్ల రాములు బొట్టు శివ కుమార్, ధైధ శ్రీనివాస్,ఆలిండియా ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు రాయల సీతారాములు మలమహనాడు నాయకులు అద్దంకి రవీందర్ ఎరుకల సంఘం నాయకులు మానుపాటి బిక్షం, సమాచార హక్కు చట్టం నాయకులు ఎన్నమల్ల భాస్కర్ ,కట్టెల శివ మెడి హరికష్ణ, అవాజ్ జిల్లా అధ్యక్షులు ఆశీమ్, ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి సీఐటీయూ జిల్లా నాయకులు ఎండి .సలీం, నాంపల్లి చంద్రమౌళి కొండ వెంకన్న దండేపల్లి సత్తయ్య, భూతం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.