Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
నవతెలంగాణ- రామన్నపేట
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని కెేవీపీిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మండలంలోని నిర్నేముల గ్రామంలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజికవేత్త ఏభూషి నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనువాదుల పాలనలో భారత రాజ్యాంగం హరించబడుతుందని విమర్శించారు. రాజ్యాంగంలో రోజుకొక్క పేజీని చింపివేస్తూ మను ధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు పాలక ప్రభుత్వాలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడు కునేందుకు ప్రతి పౌరుడు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా దళితులను, గిరిజనులను, మైనారిటీలను, కింది కులాలను అసమానతలకు గురి చేసిన మను ధర్మ సిద్ధాంతాలను ముందుకు తీసుకువచ్చి, తమ అనుకున్న రాజ్యాన్ని తీసుకురావడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై, గిరిజనులపై, మైనారిటీలపై, పేదలపై తీవ్రమైన దాడులు పెరిగాయన్నారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అనేక గ్రామాల్లో దళితులపై వివక్షత, అంటరానితనం ముందుకు సాగుతూనే ఉందన్నారు. దేశంలో 2018 సంవత్సరంలో 42,793 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయని అన్నారు. 2019లో ఇవి మరింత పెరిగాయని 45.935. కేసులు నమోదయ్యాయన్నారు. 2019లో 26.5 శాతం కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతకే పరిమితం చేయకూడదని అన్నారు. యువత అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలో ఉన్న మన వాదులు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వత్తి దారుల సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, బొడుప్పల్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి, జక్కల పద్మ, నాగటి సోమన్న, రిజర్వ్ పోలీస్ నోముల నర్సింహ, మారన్న, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి, యువజన సంఘం అధ్యక్షులు పెరుమాండ్ల స్వామి, సభ్యులు నాగటి రమేశ్, కట్ట కుమార్, నాగటి లింగస్వామి, నాగటి మహేష్, ఏభూషి రవి, నాగటి వెంకన్న, అంజయ్య, దాసరి శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.